-జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నరు…
-నూతన చీఫ్ జస్టిస్ కు గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్, సియం వై.యస్. జగన్మోహన రెడ్డి అభినందనలు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డిలు వేరువేరుగా శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలతో అభినందించారు. తొలుత రాష్ట్ర గవర్నరు. అనుమతితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవ ప్రక్రియను ప్రారంభించారు. హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ బి.యస్. భానుమతి తొలుత జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి నియమించిన నోటిఫికేషన్ ను చదివి వినిపించారు. అనంతరం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో గవర్నరు బిశ్వభూషణ్
హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అత్యంత నిరాడంబరంగా ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఏ.వి. శేషసాయి, జస్టిస్ యం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ బి. దేవానంద్, జస్టిస్ ఆర్. రఘునందరావు, జస్టిస్ దుర్గా ప్రసాద్, జస్టిస్ బి. కృష్ణమోహన్, జస్టిస్ యం. గంగారావు, జస్టిస్ కె. లలిత, జస్టిస్ మఠం వెంకటరమణ, జస్టిస్ కె. సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, యంపి వల్లభనేని భాలశౌరి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్
యంపియస్. నాగి రెడ్డి, జడ్పీ ఛైర్మన్ హారిక,విజయవాడ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణు,కె. రక్షణనిధి, వల్లభ నేని వంశీ మోహన్, గవర్నరు కార్యదర్శి ఆర్ పి. సిసోడియా, డిజిపి గౌతమ్ సవాంగ్, జిఐడి రాజకీయ కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ప్రొటోకాల్ డైరెక్టరు బాలసుబ్రహ్మణ్య రెడ్డి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి. వాణిమోహన్, జిల్లా కలెక్టరు జె. నివాస్, నగర సిపి బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవిలత, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్, పలువురు న్యాయవాదులు, జస్టిస్ పి.కె. మిశ్రా కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తేనీటి విందు కార్యక్రమం జరిగింది.
జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా ఛత్తీస్ ఘడ్ ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. రాయఘడ్ లో 29 ఆగష్టు 1964లో జన్మించిన పి.కె. మిశ్రా ఖిలాస్ పూర్ లోని గురు దాసిదాస్ విశ్వవిద్యాలయం నుంచి బియస్ సి, యల్ యల్ బి చేశారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా నమోదు అయ్యారు. రాయఘర్ జిల్లా కోర్టు జబల్ పూర్ లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, భిలాస్ పూర్ లోని ఛత్తీస్ ఘడ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.