విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబర్ 1) నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేయబడతాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపర్చిన వ్యక్తులు, సంస్థలకు 59 అవార్డులను ప్రకటించిందని, ఇందులో 29 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రకటించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మరియు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేటగిరీల వారీగా 8 సంస్థలకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11, కళలు, సంస్కృతి రంగాల్లో 20, సాహిత్యంలో 7, జర్నలిజంలో 6, మెడికల్ అండ్ హెల్త్ లో 7 మందిని అవార్డులకు ఎంపిక చేయటం జరిగిందన్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ బహుకరిస్తారని తెలిపారు. గతంలోనే ప్రధానం చేయాల్సిన అవార్డులు కోవిడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌తో పాటు అసామాన్య ప్రతిభ కనపరచిన సామాన్యులను అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిందని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …