విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం క్రింద అనుభవదారుల వివరాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సేకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులకు,సిబ్బందికి సూచించారు.
స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం రాత్రి గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు, వి.ఆర్వో లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం క్రింద ప్రస్తుతం అనుభవిస్తున్న వారికి సంపూర్ణ హక్కులు ఉంటే వారి పేరున టైటిల్ డీడ్, పట్ట జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. రుణ చెల్లింపు చేసిన సంబంధిత లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుందన్నారు. 1983 వ సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు గృహాలు పొందిన లబ్ధిదారుల జాబితాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 2.8 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మంజూరైన సమయంలో గృహాలు, గృహ పట్టాలు ఎవరికి మంజూరు అయ్యాయి, ఎవరి అనుభవంలో ప్రస్తుతం ఉన్నది తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రుణాలు తీసుకున్న మొదటిసారిగా పొందిన లబ్ధిదారుడు లేదా వారసులు అనుభవంలో ఉంటే గ్రామీణ, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతలవారిగా ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ధర చెల్లించాలన్నారు. మొదటి లబ్దిదారుడు కాకుండా ప్రస్తుతం ఇతర వ్యక్తి అనుభవంలో ఉంటే ఉన్న వ్యక్తులు – సూచించిన ధరకు రెట్టింపు చెల్లించాలని ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీలో ఉన్న లబ్ధిదారుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు నమోదు చేసుకొని వారందరితో సమావేశాన్ని నిర్వహించి వివరాలు తెలియజేయాలన్నారు. వాలంటీర్లు క్లస్టర్లలో సందర్శించి గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలను పొందు పరచాలన్నారు. ఇంటి పట్టా స్వభావము, అనుభవ స్వభావం, ఆస్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. సంబంధిత గృహం ఎవరి అనుభవంలో ఉన్నది స్పష్టంగా నిర్ధారించాలన్నారు. సర్వేయర్లు మొత్తం స్థలం విస్తీర్ణం, చదరపు అడుగులు వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. వన్ టైం సెటిల్మెంట్ పట్ల అవగాహన కల్పించాలని తద్వారా అనుభవందారు పేరు పైన స్థలము లేదా గృహం రిజిస్ట్రేషన్ జరిగి సంపూర్ణ హక్కులు సంభవిస్తాయని, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎల్.శివశంకర్,నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్,హోసింగ్ పిడి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …