-రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జీవితం తరతరాలకు ఆదర్శం
-అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారు
-గత చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26 న ఆమోదించబడిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేడ్కర్ కృషి కారణంగానే భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలకు సంక్రమించిన అనేక హక్కులు రాజ్యాంగ ఫలితమే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఆ మహనీయుడు అందించిన రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాలించే నాయకుడు సమర్థుడైతే.. రాజ్యాంగం అమలు కూడా సమర్థవంతంగా, రాష్ట్రం శక్తివంతంగా తయారవుతుందని మల్లాది విష్ణు అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. వ్యవస్థలను ఏవిధంగా నాశనం చేసిందో ప్రజలందరూ చూశారన్నారు. కనీస ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందని గుర్తుచేశారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ పాలన సాగిస్తున్నారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. ప్రజల యొక్క అన్ని హక్కులను రాజ్యాంగపరంగా కాపాడుతున్నారన్నారు. అంబేద్కర్ స్పూర్తితో సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చిత్తశుద్ధితో బాధ్యతలు నెరవేరుస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందించడతో పాటు.. విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్నారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనతోనే సాధ్యమైందని మల్లాది విష్ణు అన్నారు.