Breaking News

గాలి, వెలుతురు ఇళ్లలోకి ప్రసరించేలా భవనాల నిర్మాణం జరగాలి : ఉపరాష్ట్రపతి

– పీల్చే గాలి మన ఆరోగ్య సంరక్షణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కరోనా మరోసారి గుర్తుచేసింది
– వాయుకాలుష్యం పెరుగుతుండటం ఆందోళనకరం. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగోనాల్సిన అవసరం ఉందని సూచన
– గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య వసతుల కల్పన దిశగా దృష్టిపెట్టాలని సూచించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
– ‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ – బ్రాంకస్ 2021’ వార్షిక సదస్సును అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు నిరంతరం ప్రసరించేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి మన జీవనంలో ప్రాధాన్యతను కల్పించాలనే విషయాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తుచేసిందని ఆయన పేర్కొన్నారు.
శనివారం హైదరాబాద్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ – బ్రాంకస్ 2021’ రెండో వార్షిక సదస్సును ఢిల్లీ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గాలి ప్రసారం లేనిచోటే గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఇటీవలి కాలంలో వైద్యపరిశోధనల్లో వెల్లడైన అంశాన్ని ప్రస్తావించారు. సరైన వెలుతురు లేని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.
అందుకే నివాస ప్రాంతాలు, పనిచేసే చోట సరైన వెలుతురు, గాలి ప్రసారం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో వైద్యులు, వైద్య సహాయక సిబ్బంది చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
కరోనా అనంతర పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన శ్వాసకోస వ్యవస్థ ప్రాధాన్యత ప్రజలకు తెలిసొచ్చిందని, అయితే ఈ విషయంలో వారిలో మరింత అవగాహన కల్పించే విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇతర భాగస్వామ్య పక్షాలు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
పొగాకు వినియోగం ద్వారా పెరుగుతున్న ఊపిరితిత్తుల కేన్సర్, గొంతు కేన్సర్ వంటి సమస్యల విషయంలోనూ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు.
ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటం, మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉండటంపై ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాహన కాలుష్యం తదితర అంశాలు ఇందుకు కారణమన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడూ రానున్న సమస్యలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో తమ బాధ్యతను గుర్తెరగాల్సిన తక్షణావసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.
రొబోటిక్స్, కన్ఫోకల్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటూ భారతదేశంలోని వివిధ ఆసుపత్రులు పల్మనాలజీ సంబంధిత వైద్యంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. వ్యాధి నిర్ధారణ, వినూత్న చికిత్సావిధానాలు, సానుకూల ఫలితాలు సాధిస్తున్నందున.. యావత్ భారతదేశం, ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా భాసిల్లే దిశగా వేగంగా ముందుకెళ్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల కల్పన అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి వైద్యరంగం తోడ్పాటునందించాలన్నారు. ‘ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాల్లో భారతదేశానికి ఉన్న శక్తి, సామర్థ్యాలను వినియోగిస్తూ గ్రామాల్లోని ప్రజలకు ప్రపంచస్థాయిలో టెలిమెడిసిన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు వైద్య వసతులు అందుబాటు ధరల్లో ఉండేలా భాగస్వామ్య పక్షాలన్నీ కృషిచేయాలన్నారు.
టీకాకరణ వేగంగా సాగుతున్నందున కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో భారతదేశం గణనీయమైన పురోగతి కనబరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బృందస్ఫూర్తితో కృషిచేసిన ప్రభుత్వాలు, వైద్యరంగం, ఇతర వర్గాల కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు.
భారతదేశంలో శ్వాసకోస సమస్యలు సహా అసంక్రమిత వ్యాధుల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. యువకులు ఆరోగ్యకర జీవన విధానాలను అలవర్చుకోవాలని సూచించారు. పౌష్టికాహారాన్ని తీసుకోవడంతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టిసారించాలని ఇందుకోసం యోగ, ధ్యానం తదితర మార్గాలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్రాంకస్ 2021 అధ్యక్షుడు డాక్టర్ గోనుగుంట్ల హరికృష్ణ, యురోపియన్ అసోసియేషన్ ఆఫ్ బ్రాంకాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ మహమ్మద్ మునావర్, యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఈ ఆసుపత్రుల చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విష్ణు రెడ్డితోపాటు వివిధ దేశాలనుంచి ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు, వైద్య ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *