-ముఖ్యఅతిధిగా హాజరుకానున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్
-40 మంది విద్యార్థులకు బంగారు , 40 మందికి రజత పతకాలు ప్రదానం …
-ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ సినీ నటుడు అలీ తో సహా 5 గురికి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కె ఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 18 వ తేదీ శనివారం నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారధివర్మ వెల్లడించారు. నగరంలోని యూనివర్సిటీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవ విశేషాలను తెలియచేసారు. తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న 3444 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఇందులో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ కనబరచిన 40 మంది విద్యార్థులకు బంగారు, 40 మంది విద్యార్థులకు రజత పతకాలను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ముఖ్య అతిధిగా పాల్గొని స్నాతకోపన్యాసం చేస్తారని, వోల్వో కంపెనీ అధ్యక్షులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమల్ బాలి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ సినీ నటుడు అలీ గౌరవ అతిధులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పారు. అలాగే వీరందరికీ యూనివర్సిటీ తరుపున గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేస్తున్నట్లు కూడా సారధివర్మ తెలిపారు.ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రో – వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంకట్రామ్ , రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసాదరావు, డీన్ కిశోర్ బాబు పాల్గొన్నారు.