విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా 3వ దశ విజృంభిస్తున్న సందర్భంగా ఏపీలోని విద్యా సంస్థలకు సెలవులు పొడిగించి, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో ప్రతిరోజు 5 వేలకు సమీపంలో కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. సిపిఐ శ్రేణులు ఇతర కార్యక్రమాలు పక్కనబెట్టి, కరోనా బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నామన్నారు. ఫంక్షన్లు, సమావేశాలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు తదితరాలకు కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారన్నారు. కోర్టులు సైతం వర్చువల్ విచారణకు మాత్రమే అనుమతించాయన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏపీ ప్రభుత్వం స్కూళ్లు తెరవటం ఆందోళనకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈనెల 30 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు.
సిపిఐ రామకృష్ణకు కరోనా పాజిటివ్…
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణకు ఈరోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా 3వ దశ రోజురోజుకి ఉధృతమవుతోంది. ప్రస్తుతం రామకృష్ణ స్వల్ప లక్షణాలతో హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.