అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్ శివారులో నిర్మించిన ముచ్చింతల్ ఆధ్మాత్మిక కేంద్రంలో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏర్పట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణకు ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5 న భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ముందుగా ఫిబ్రవరి 2 న తెలంగాణ సీఎం కేసీఆర్ , శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఈకార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు , పలువురు సినీరాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 5 న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సమతామూర్తి భగవత్ శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 13 న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా విగ్రహంలోని అంతర్గత గదులను ప్రారంభిస్తారు. 12 రోజుల పాటు జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హాజరు కావచ్చని చినజీయర్ స్వామి ఆశ్రమ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ గ్రామంలో నిర్మించిన ఈ 216 అడుగుల భగవత్ శ్రీరామానుజాచార్యుల విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కూర్చున్న భంగిమ కలిగి ఉన్న విగ్రహాలలో ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహంగా నిలవనుంది. థాయిలాండ్ లోని బుద్ధ విగ్రహం మొదటి స్థానంలో ఉంది. ఈ ‘ పంచలోహ విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, ఇత్తడి మరియు జింక్లతో రూపొందించారు. 45 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి అనుబంధంగా 108 దివ్య దేశాలు , 108 విష్ణు ఆలయాలు నిర్మించారు. భగవత్ శ్రీరామానుజాచార్యులు భూమిపై 120 ఏళ్ల పాటు నివసించిన సందర్భంగా ఇక్కడి గర్భగుడిలో 120 కిలోల స్వామివారి ” స్వర్ణ విగ్రహాన్ని ” ఏర్పాటు చేశారు. సుమారు రూ .1000 కోట్లతో దేశ విదేశాల నుంచి భక్తులు అందించిన విరాళాలతో ఈ ఆధ్యాత్మిక వనాన్ని తీర్చిదిద్దారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …