Breaking News

విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-ప్రతి అంశంలో ప్రత్యేకత కనబరచాలని మంత్రి మేకపాటి ఆదేశం
-దుబాయ్ ఎక్స్ పో -2022 ఏర్పాట్లపై మంత్రి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రతి అంశంలో ప్రత్యేక కనబరచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దుబాయ్ ఎక్స్ పో -2022 ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య జరగనున్న ఎక్స్ పోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం హాజరవుతోందన్నారు. పలు ఆహార, సరకు రవాణా కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చిన నేపథ్యంలో పర్యటన విజయవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. దుబయ్ ఎక్స్ పోలో వివిధ రాష్ట్రాలు హాజరవుతున్నాయని, దుబయ్ లోని ఇండియా పెవిలియన్ భవనంలో 11 నుంచి 17 తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది ఈ సందర్భంగా మంత్రి మేకపాటికి వివరించారు. 13 నుంచి 17 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక కార్యక్రమాలను నిర్వహించేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళిక చేసిందని ఆయన పేర్కొన్నారు. పెవిలియన్ లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐ.టీ, పోర్టులు సహా పలు రంగాలపై ఏపీ ప్రత్యేకతను చాటేందుకు చేసిన కసరత్తును మంత్రి ముందు ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది ప్రజంటేషన్ ఇచ్చారు. దుబయ్ ఎక్స్ పో సన్నద్ధత ఏర్పాట్లలో పరిశ్రమల శాఖ , ఏపీఐఐసీ సమన్వయంతో చేసిన కృషిని మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు.

తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా దుబాయ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు…
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది పేర్కొన్నారు.పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వాతావరణం, ప్రత్యేకతలు, సానుకూల అంశాల సమ్మేళనంగా పెవిలియన్ ఏవీ(ఆడియో విజువల్)లను తీర్చిదిద్దినట్లు వారు స్పష్టం చేశారు. పెవిలియన్ లోని దృశ్యాలకు తగ్గట్లు ఆకర్షించే నేపథ్య సంగీతం, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వీడియోల తయారీ జరిగినట్లు మంత్రికి వివరించారు. విదేశీ అతిథులకు ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులు, నైపుణ్య కళాకారుల గొప్పతనం చాటే కొండపల్లి, ఏటికొప్పాక తరహా బొమ్మలను చిరుకానుకగా అందించే దిశగా మంత్రి మేకపాటి దిశానిర్దేశం చేశారు. కొన్ని బొమ్మలను ఆయన ప్రజంటేషన్ ద్వారా తిలకించి ఓకే చేశారు. జాయింట్ డైరెక్టర్ వీ.ఆర్.వీ.ఆర్ నాయక్ ఆధ్వర్యంలో పెవిలియన్ నిర్వహణ, బ్రౌచర్స్, నిర్విరామంగా ప్రమోషన్ కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ నిర్ణయించింది.

పర్యటన సాగేదిలా…
ఫిబ్రవరి 13వ తేదీన 100 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాల(తెలుగు డయాస్పర) నిర్వహణకు పరిశ్రమల శాఖ ప్రణాళిక రచించింది. 14న పారిశ్రామికవేత్తలతో సీఎక్స్ వో రౌండ్ టేబుల్ సమావేశం, రోడ్ షో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అదే రోజు సాయంత్రం 250 మందికి పైగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి నేతృత్వంలో భారీ సమావేశం నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. 15వ తేదీన ప్రపంచ స్థాయి సకల సదుపాయాలతో కూడిన డీపీ వల్డ్ ఫెసిలిటీ సైట్ విజిట్ తో పాటు వివిధ ఎమిరేట్ కంపెనీలతో బీ2జీ మీటింగ్ కు ప్లాన్ చేసింది. 16న ‘ముబదల’ పెట్టుబడుల కంపెనీతో మంత్రి సమావేశమై ఏపీ గురించి చర్చించే విధంగా కార్యాచరణ రూపొందించింది. భారత రాయబారి సహకారంతో ముబదల ప్రత్యేక సమావేశానికి పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 12 స్క్రీన్ ల ద్వారా కీలక రంగాలకు సంబంధించిన అంశాలకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ లో పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దుబయ్ లో ఆయిల్ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో కెమికల్, పెట్రో కెమికల్ స్క్రీన్ లకు మరింత ప్రాధాన్యత దిశగా శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపింది. నీటి ప్రాజెక్టులు, పర్యాటక, హెల్త్ హబ్ లు, కడప స్టీల్ ప్లాంట్, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, రెన్యువబుల్ ఎనర్జీ, ఆహార శుద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పెట్టుబడులకు ఆస్కారం ఉన్న వివరాలపైనా ప్రజంటేషన్ ఇచ్చే అవకాశమున్నట్లు పేర్కొంది.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాయింట్ డైరెక్టర్లు ఇందిరా, వీఆర్ వీఆర్ నాయక్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, తదితరులు హాజరయ్యారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *