Breaking News

కరోనా నష్టాన్ని భర్తి చేసే విధంగా విశ్వ విద్యాలయాల కార్యాచరణ…

-ఉపకులపతులను ఆదేశించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో విశ్వవిద్యాలయాలు బోధన, పరీక్షలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కరోనా వల్ల ప్రస్తుత విద్యా సంవత్సరంలో చోటుచేసుకున్న నష్టాన్ని పూరించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా బుధవారం రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో గవర్నర్ సమావేశం అయ్యారు. వీరితో వేర్వేరుగా మాట్లాడిన గవర్నర్ విభిన్న అంశాలపై దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నిర్ణీత కాలవ్యవధిలో పెండింగ్ లేకుండా అన్ని విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్ధలు పూర్తి స్ధాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఉపకులపతులతో తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు. గవర్నర్ ఆలోచనలు, ఆకాంక్షలను గురించి ఈ భేటీలో మరింత విపులంగా చర్చించారు. కరోనా వ్యాప్తత తీవ్రంగా ఉన్న సమయంలో గవర్నర్ సూచనల మేరకు రద్దు చేసిన స్నాతకోత్సవాలను వేగంగా పూర్తి చేయాలని గవర్నర్ తాజాగా ఆదేశించారని ఈ సందర్భంగా సిసోడియా ఉపకులపతులకు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, వచ్చే నెలలో వాటిని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం కావాలని స్పష్టం చేసారు. ఇతర విశ్వవిద్యాలయాలు సైతం సకాలంలో స్నాతకోత్సవాలు పూర్తి చేసుకోవాలన్నదే గౌరవ కులపతి ఆకాంక్ష అని వివరించారు. ఈ సమావేశంలో కడప యోగి వేమన, గుంటూరు అచార్య ఎన్ జి రంగా, శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాకినాడ జెఎన్ టియు, అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ ఉప కులపతులు వరుసగా అచార్య సూర్య కళావతి, డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, అచార్య వెంకట్రావు, అచార్య జివిఆర్ ప్రసాద రాజు, అచార్య రామకృష్ణా రెడ్డిలతో పాటు శ్రీకాకుళం బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడు అచార్య రాజేష్, అయా విశ్వ విద్యాలయాల రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *