Breaking News

ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా మహిళలు తమ సత్తా చాటుతారు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
అవకాశం, ప్రోత్సాహం అందిస్తే ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాలలో తమ సత్తా చాటుతారని రెవిన్యూ డివిజినల్ అధికారి కంభంపాటి రాజ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక డా.ఎం.ఆర్. అప్పారావు పి .జీ. సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ సేవ పధకంలో ఉత్తమ సేవలందించిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను ఆర్డీఓ అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆర్డీఓ శ్రీమతి రాజ్యలక్ష్మిని దుశ్శాలువా, పూలమాల, మెమెంటో లతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రోత్సాహం, చేయూత అందిస్తే మహిళలు అన్ని రంగాలలోనూ తమ ప్రతిభను ప్రదర్శిస్తారన్నారు. మహిళలందరూ అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా అగ్ర స్థానంలో నిలవాలన్నారు. విద్య తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సాహించాలన్నారు. మహిళల పట్ల వివక్ష కుటుంబం నుండి ప్రారంభమవుతుందన్నారు. మహిళల ఉజ్వల భవిషత్తుకు బాటలు వేసేందుకు మొదటి అడుగు కుటుంబం నుండే ప్రారంభం కావాలన్నారు. ప్రతీ తల్లితండ్రులు తన కూతురుకి ఏ రంగంలో అభిరుచి ఉందొ తెలుసుకుని, ఆ రంగంలో అత్యుత్తమ శిక్షణ అందించేందుకు తగిన ప్రోత్సాహకరమైన వాతావరణం కుటుంబంలో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లితండ్రులు తమ కూతురుకి చిన్నతనంలోనే వివాహం చేయకుండా, ఉన్నత విద్యాభ్యాసం అందించి, వారి కాళ్ళపై వారి నిలబడే విధంగా చేయూతను ఇవ్వాలన్నారు. ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాలలో తమ సత్తాను చూపిస్తున్నారన్నారు. అవకాశం ఇస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాదించగల సత్తా మహిళలలో ఉందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుని మహిళలు అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *