-విత్తు నుండి విక్రయం వరకూ అన్ని సేవలు రైతులకు సకాలంలో అందేలా చూడాలి
-సాంకేతిక కారణాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ జమకాని రైతుల డాటాను పునఃసమీక్షించండి
-ఇంటిగ్రేడెట్ కాల్ సెంటర్ కు అందే అన్ని ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి
-రైతులకు అర్థం అయ్యే విధంగా తెలుగులోనే సోషల్ అడిట్ సమాచారం పొందుపర్చాలి
-ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి
-రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వ్యవసాయ ఇన్పుట్స్ కొరత ఏమాత్రం లేకుండా తగినంత పరిమాణంలో నిల్వలను ముందుగానే సమకూర్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమావేశమై ఆయా శాఖల కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రైతు భరోసా కేంద్రాల్లో విత్తు నుండి విక్రయం వరకూ అన్ని సేవలు రైతులకు సకాలంలో అందేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఏసీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నష్ట పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ కొంతమంది రైతుల ఖాతాల్లో జమకావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఆ రైతులకు చెందిన డేటాను పునః సమీక్షించి, తప్పొప్పులను సరిదిద్ది ఇన్పుట్ సబ్సిడీ ఆ రైతుల ఖాతాల్లో తిరిగి జమఅయ్యేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఇటు వంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా ఇ-క్రాప్ డేటా ఎంట్రీ సమయంలోనే సమగ్ర సమాచారాన్ని రైతుల నుండి సేకరించి ఎటు వంటి తప్పులు లేకుండా ఇ-క్రాప్ డేటాను ఎంట్రీ చేసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతుల నుండి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కు అందే ఫిర్యాదులు, సమస్యలను సత్వరమే పరిష్కరించే యంత్రాంగాన్ని ఆ కాల్ సెంటర్ లో ఏర్పాటు చేయాలే గాని, ఆ ఫిర్యాధులను మళ్లీ సంబందిత అధికారులకు పార్వర్డు చేయడం అనే విధానానికి స్వస్తిచెప్పాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలను ఆన్లైన్లో జరిగే విధంగా చూడాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆర్.బి.కె.ల్లో చేయాలని ప్రత్యేకించి కియోస్కుల పనితీరును మెరుగు పర్చి ఆర్.ఎఫ్.ఐ.డి. కార్డు రీడర్లను ప్రొవైడ్ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. రైతులకు అర్థం అయ్యే విధంగా తెలుగులోనే సోషల్ అడిట్ సమాచారం పొందుపర్చాలన్నారు. ఆర్.బి.కె. చానల్ ద్వారా ప్రసారం అయ్యే రైతు విజ్ఞాన కార్యక్రమాలను రైతులు అంతా వీక్షించే విధంగా వారికి అనుకూల సమయాల్లోనే ఈ కార్యక్రమాలు ప్రసారం అయ్యే విధంగా షెడ్యూలును ఖరారు చేయాలన్నారు.
రైతులకు పెద్ద ఎత్తున మేలు చేసేందుకే వ్యవసాయ సలహా బోర్డులను అన్ని స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి పనితీరును మెరుగుపర్చేందుకై సమావేశాలు నిర్వహించే షెడ్యూలును ముందుగా ఖరారు చేయడమే కాకుండా సమావేశ అజండాలను ముందుగానే కమ్యునికేట్ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రకృత్తి వ్యవసాయ విధానాలపై రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు ఎ.పి.కమ్యునిటీ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు పరుస్తున్నదని, అయితే ఈ కార్యక్రమాన్ని అన్ని ఆర్.బి.కె.లకు సత్వరమే విస్తరింపచేస్తే మరింత సత్ ఫలితాలు రైతులు పొందుతారనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి అయ్యే ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీచేసే విషయంలో అధికారులు ప్రత్యేక చొరవచూపాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్.బి.కె.లకు, 154 ఆర్.బి.కె. హబ్ లకు, 13 జిల్లా రిసోర్సు కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, అవసరమైన సామాగ్రిసంపత్తిని అంతా సత్వరమే సమకూర్చుకోవాలని, అందుకు అవసరమైన నిధులు ఏ మేరకు కావాలో తన దృష్టికి తెస్తే, వాటిని సమకూర్చేందుకు సత్వరమే చర్యలు చేపడతామని అధికారులకు మంత్రి సూచించారు.
రాష్ట్రంలోని రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాల ప్రగతిని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ముంగిళ్లలో అందజేసే సేవల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరి హరి కిరణ్ మంత్రికి వివరించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుస్మిత, రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు ఏ.పి. కమ్యునిటీ నేచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ స్పెషల్ సి.ఎస్. (రిటైర్డు) టి.విజయకుమార్ తో పాటు వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకులు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.