-యుద్ధ ప్రాతిపదికన ఉపాధిహామీ పనులు చేపట్టడం జరుగుతుంది
-పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకు 1072 కోట్ల రూ.లకు పరిపాలనామోదం
-పియంజెఎస్ వై చేసిన పనులకు 83 కోట్ల రూ.లు మంజూరుకు చర్యలు
-ఆర్డబ్ల్యుఎస్ లో చేసిన పనులకు 800 కోట్ల రూ.లు పెండింగ్ బిల్లులు మంజూరు
-నీటిఎద్దడి గల గ్రామాల్లో ట్యాంకర్లు ద్వారా మంచినీటి సరఫరా
-బిల్లులు రావని కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-ఇకపై క్లాప్ మిత్రలుగా స్వచ్ఛ సంకల్పంలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లు
-రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం కింద చేసిన పనులకు సంబంధించి 1900 కోట్ల రూ.ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చెప్పారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖపై సోమవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షించారని అన్నారు.ఈసందర్భంగా పంచాయితీరాజ్ శాఖలో వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని,ఉపాధిహామీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సియం ఆదేశించారని చెప్పారు.ఉపాధిహామీ పధకంలో చేసిన పనులకు సంబంధించి 1900 కోట్ల రూ.ల బిల్లులను వెంటేనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సియం ఆదేశించారన్నారు.అదే విధంగా మెటీరియల్ కాంపొనెంట్ తో నిర్వహించే రైతు భరోసా కేంద్రాలు,గ్రామ సచివాలయాల భవనాలు,వెల్నెస్ కేంద్రాలు,బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు సహా వివిధ భవన నిర్మాణాలకు ఎక్కడా సిమ్మెంట్ కొరత లేకుండా చూడాలని సియం ఆదేశించారని ముత్యాల నాయుడు వివరించారు.నిరంతర సిమ్మెంట్ సరఫరాకై ఆయా కంపెనీలతో సంప్రదించేందుకు వీలుగా ఒక లైజన్ అధికారిని నియమించాలని సియం ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 9వేల కి.మీల పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకుగాను 1073 కోట్ల రూ.లు విడుదల చేసేందుకు వెంటనే అవసరమైన పరిపాలనామోదాన్నిఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ఇందుకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించి పనులను కూడా మొదలు పెట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.పనుల నాణ్యత విషంయలో ఎంతమాత్రం రాజీపడే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.ఎక్కడైనా పనుల నిర్వహణలో నాణ్యత లోపించినట్టు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన 83కోట్ల రూ.ల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సియం ఆదేశించారని ఆబిల్లులను కూడా వెంటనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.
గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పధకంలో చేసిన పనులకు సంబంధించిన 800 కోట్ల రూ.లు బకాయిలను కూడా వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నీటి ఎద్దడి గల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతోందని తెలిపారు.అదే విధంగా జగనన్న కాలనీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ముత్యాల నాయుడు చెప్పారు.
వైయస్ఆర్ జలకళ కార్యక్రమం కింద ఉచితంగా బోరు తవ్వించడం,విద్యుత్ కనక్షన్, పైపు వేయడం తోపాటు దూరంగా ఉన్న పొలాల్లో బోరువేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 2లక్షల రూ.లు వరకూ ప్రభుత్వమే భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు మీడియాకు వివరించారు.వైయస్సార్ చేయూత కార్యక్రమాన్నివిజయవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చేందుకు ఇంటింటా చెత్త సేకరణకు ప్రతి ఇంటికీ రెండేసి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు చెప్పారు.ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తను వేరువేరుగా సేకరించి దానిని సెగ్రిగేషన్ పాయింటుకు రవాణా చేసేందుకు వీలుగా ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ట్రాక్టర్ ను అందించనున్నట్టు ఆయన తెలిపారు.స్వచ్ఛ సంకల్పం పధకంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గ్రీన్ అంబాసిడర్లుగా పిలవబడుతున్నవారిని ఇకమీదట క్లాప్ మిత్రలుగా పిలవాలని నిర్ణయించడం జరిగిందని ఆయన చెప్పారు.వారికి చెల్లించాల్సిన మూడు నెలల జీతాల బకాయిలను కూడా వెంటనే చెల్లించడంతో పాటు ఇకమీదట వారికి నెలనెలా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు వెల్లడించారు.