-కులపతి హోదాలో దిశా నిర్దేశం చేయనున్న బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన గురువారం విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జరగనుందని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. రాజ్ భవన్ దర్బార్ హాలు వేదికగా నిర్వహించే ఈ సదస్సులో గవర్నర్ ఉపకులపతులకు ఉన్నత విద్యావ్యవస్ధకు సంబంధించి దిశా నిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో గవర్నర్ కులపతి హోదాలో కీలకోపన్యాసం చేయనున్నారని వివరించారు. ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర, అచార్య నాగార్జున, శ్రీ కృష్ణ దేవరాయ, ఆదికవి నన్నయ్య, యోగి వేమన, డాక్టర్ వైఎస్ ఆర్ అర్కిటెక్చర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కృష్ణా, రాయలసీమ, విక్రమ సింహపురి, కాకినాడ, అనంతపురం, విజయనగరం జెఎన్ టియులు, శ్రీ పద్మావతి మహిళా, ద్రవిడియన్, డాక్టర్ అబ్దుల్ కలామ్ ఉర్దూ, క్లస్టర్, డాక్టర్ ఎన్ టిఆర్, శ్రీ వెంకటేశ్వర పశువైద్య, డాక్టర్ వైఎస్ ఆర్ ఉద్యానవన, అచార్య ఎన్ జి రంగా వ్యవసాయ, అంధ్ర కేసరి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాల నుండి ఉపకులపతులు ఈ సదస్సుకు హాజరు అవుతారని సిసోడియా పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అచార్య హేమచంద్రా రెడ్డి ప్రారంభోపన్యాసం చేయనుండగా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నత విద్యామండలి కార్యదర్శి అచార్య సుధీర్ ప్రేమ్ కుమార్ , ఉపాధ్యక్షుడు రామమోహన రావు తదితరులు ఈ సదస్సులో భాగస్వామలు కానున్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆన్ లైన్ విధానంలోనే గవర్నర్ ఉపకులపతులతో సమావేశం అవుతుండగా, తాజా పరిస్ధితుల నేపధ్యంలో రాజ్ భవన్ వేదికగా పూర్తి స్దాయిలో సదస్సు నిర్వహిస్తున్నామని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.