-సెంట్రల్ లో విద్యకు రూ. వంద కోట్ల నిధులు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ గతిని మార్చే శక్తి ఒక్క చదువుకే ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మాచవరంలోని ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జరిగిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ విద్యార్థులకు చేయూతనందిస్తున్నట్లు వెల్లడించారు. మరీ ముఖ్యంగా ఉన్నత విద్య ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న ప్రస్తుత తరుణంలో.. విద్యాదీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యనందిస్తోందన్నారు. పేదలు పెద్ద చదువులకు దూరం కాకూడదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తుచేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రూ. 30 వేల వరకు మాత్రమే పథకం వర్తిస్తుందని నిబంధనలు విధించిందన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల చదువుకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా రూ. 14 కోట్ల నిధులను సెంట్రల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు అందజేసినట్లు వివరించారు. అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లుల ఖాతాలలో రెండేళ్లలో రూ. 85 కోట్ల 45 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ. వంద కోట్ల నిధులతో ఈ మూడేళ్లలో నియోజకవర్గంలోని విద్యార్థుల బంగారు భవితకు జగనన్న ప్రభుత్వం బాటలు వేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విప్లవంతో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో విద్యార్థుల సంఖ్య గణనీయం పెరిగిందని.. డ్రాపవుట్లు తగ్గాయని మల్లాది విష్ణు అన్నారు.
చదువుకున్న వారికి లభించే గౌరవం.. ఎంత డబ్బున్నా దొరకదనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని మల్లాది విష్ణు అన్నారు. కనుక ప్రతిఒక్క విద్యార్థి ఖచ్చితంగా 75 శాతం హాజరు కలిగి ఉండాలని సూచించారు. ఎస్.ఆర్.ఆర్. మరియు సి.వి.ఆర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో 1,861 మంది విద్యార్థులకు విద్యాదీవెన ద్వారా రూ. 32 లక్షల 41 వేల 663., వసతి దీవెన ద్వారా 1,682 మంది విద్యార్థులకు రూ. కోటి 59 లక్షల 81 వేల 200 ఆర్థిక చేయూతను అందించినట్లు పేర్కొన్నారు. మరోవైపు డివిజన్ పర్యటనలలో విద్యాదీవెన నిధులు జమకానీ కొందరు తల్లులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యా శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, కళాశాలల ప్రిన్సిపల్స్ కలిసి తరచూ సమావేశాలు నిర్వహించుకుని విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఎస్.ఆర్.ఆర్. & సి.వి.ఆర్ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని.. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులెందరో ఉన్నత స్థానాలను అధిరోహించారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి కళాశాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కళాశాలకు ప్రహరీ గోడను నిర్మించి పరిరక్షించడం జరిగిందన్నారు. మరలా ఇప్పుడు రూ. 2.50 కోట్ల నిధులు కాలేజీ అభివృద్ధికి మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ నిధులను సకాలంలో విడుదల చేయించి.. కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో 2వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ నిర్మల కుమారి, జిల్లా సంక్షేమ అధికారి విజయభారతి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రుక్మంగదయ్య, కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు, నాయకులు కనపర్తి కొండ, కోలా నాగాంజనేయులు, పారా ప్రసాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.