Breaking News

నకిలీ ఎరువుల తయారీదారులపై వరుస దాడులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అక్రమంగా ఎరువులను తయారు చేస్తున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించే విధముగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టుచున్నది. సత్తుపల్లి ఎరువుల దుకాణాలలో పోటాష్ కు మారుగా ఇసుకకు రంగు కలిపి విక్రయిస్తున్న వారిని తెలంగాణ వ్యవసాయ అధికారులు, పోలీస్ వారు పట్టుకుని విచారించారు. దాని తయారీదారులు, విక్రయకారులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్లు తెలుసుకుని, మన రాష్ట్ర వ్యవసాయ శాఖ సిబ్బంది పోలీస్ వారి సహకారంతో వరుస దాడులు నిర్వహిస్తున్నారు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో 11. 5. 2022 తేదీన గోదాములో ఉన్న సరుకులను, నకిలీ ఎరువుల తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాలు తెలంగాణ అధికారులు స్థానిక వ్యవసాయ అధికారుల సమక్షంలో సీజ్ చేయగా స్థానిక అధికారులు ఆ తీగ లాగితే ఒక్కక్కరిగా నకిలీ తయారీదారుల డొంక కదులుతూ ఉంది. గన్నవరం వ్యవసాయ సహాయ సంచాలకుల ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ అధికారి, ఎస్సై, ఇతర సిబ్బంది సూరంపల్లి గ్రామములో వేమవరపు శివరాం కు చెందిన ఇతర గోదాములపై దాడి చేసి అక్కడ కూడా నకిలీ ఎరువులు తయారుచేసిన ఆనవాళ్లు గుర్తించారు. అదే గోదాములో మిగిలి ఉన్న ఎరువుల నమూనాలు సేకరించడం తో పాటు అక్కడ దొరికిన కొన్ని పత్రాల ఆధారంగా ఏ ఏ ఎరువులు తాయారు చేసింది , వాటిని ఎవరికీ విక్రయించింది అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు . NTR జిల్లా, జిల్లా వ్యవసాయ అధికారి వారి పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు విజయవాడ శివారు జగ్గంపూడి లో కూడా తనిఖీలు నిర్వహించారు. వీరి తనిఖీ లలో కూడా కొన్ని గోదాములు పరిశీలించి నకిలీ ఎరువుల తయారీలో వీరి పాత్రపై విచారణ చేయుచున్నారు. ఈ మొత్తం వ్యవహారం లో సంబంధం ఉన్న ఒక బయో కంపెనీ యజమాని పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అతని జి ఎస్ టి నెంబర్ ఆధారంగా ఎరువుల విక్రయ వివరాలు సేకరించి కొనుగోలు చేసిన డీలర్లు మరియు పంపిణి దారులపై కఠిన చర్యలు తీసుకునే విధముగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందాలను వివిధ జిల్లాలకు పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో ముందుగానే పరీక్షించిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పెద్ద ఎత్తున RBK ల ద్వారా రైతులకు అందిస్తూ ఉండగా రాష్ట్రంలో ఇలాంటి తయారీ దారుల మూలాలు ఉండటం ఎంత మాత్రం సహించరానిది. రైతులకు నాణ్యత లేని ఎరువులు విక్రయించినా , తయారుచేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి పేరుమీద ఉన్న అన్ని ఇతర వ్యాపారాలు, లైసెన్స్ లు రద్దు పరచడమే కాకుండా ఇందులో భాగస్వాములైన అందరిని నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం జైలుకు పంపించడం జరుగుతుందని ప్రత్యేక వ్యవసాయ కమీషనర్  చేవూరు హరి కిరణ్  తెలిపారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *