Breaking News

గన్నవరం నుంచి దావోస్ బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. నేటి రాత్రికి (శుక్రవారం) దావోస్ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్‌ కేంద్రంగా జరిగే వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొంటారు.

రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా : ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్‌ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు.. బెంగళూరు-హైదరాబాద్‌, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు.

కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామం కానుంది. కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో సీఎం బృందం వివరించనుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్‌ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్‌ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పీపుల్‌-ప్రోగ్రెస్‌-పాజిబిలిటీస్‌ నినాదంతో ఈ పెవిలియన్‌ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ సమ్మిట్‌ గత డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరగడంతో సమ్మిట్‌ను వాయిదా వేశారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *