Breaking News

ఎస్సీ విద్యార్థులకు ఆన్ లైన్ టీచింగ్.. ఆఫ్ లైన్ కోచింగ్..

-ఐఐటీ, జెఇఇ, నీట్ లలో శిక్షణ
-8 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించిన మంత్రి మేరుగు నాగార్జున

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి ప్రయత్నించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హితవు చెప్పారు. విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ, జెఇఇ, నీట్ పరీక్షలకు సంబంధించిన షార్ట్ టర్మ్ కోచింగ్ ను సోమవారం వర్చువల్ విధానంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ఇప్పటి వరకూ ఎస్సీ విద్యార్థులకు 3 కేంద్రాల్లో మాత్రమే ఐఐటీ, జెఇఇ, నీట్ పరీక్షలకు శిక్షణలు ఇస్తుండగా ఈ ఏడాది ఈ సంఖ్యను 8 కేంద్రాలకు పెంచడం జరిగిందని తెలిపారు. బాలికలకు మధురవాడ (విశాఖపట్నం), ఈడ్పుగల్లు (పెనుమలూరు), సింగరాయకొండ (ప్రకాశం), చిన్న చౌక్ (కడప) లలోనూ, బాలురకు కొత్తూరు (అనపర్తి), చిల్లకూరు(నెల్లూరు), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు), చిన్న టేకూరు (కర్నూలు)ల్లోనూ ఈ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అంబేద్కర్ గురుకులాల ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒకటి చొప్పున పోటీ పరీక్షల కేంద్రాలను ప్రారంభించడానికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందే విద్యార్థులకు ఆన్ లైన్ లో టీచింగ్, ఆఫ్ లైన్ లో కోచింగ్ ఉంటుందని చెప్పారు. పేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన అన్ని అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని, వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యార్థులు ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటును సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా వారి తల్లిదండ్రులు కంటున్న కలలను నిజం చేయాలని నాగార్జున హితవు చెప్పారు. జెఇఇ, ఐఐటీ. నీట్ పరీక్షలలో మరింత ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించి డాక్టర్లు, ఇంజనీర్లుగా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగానే మంత్రి కొందరు విద్యార్థులతో సంభాషించారు. తాము ఇళ్లలో ఉండి చదువుకోవడం కంటే ఇలాంటి శిక్షణా కేంద్రాల్లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, తాము అనుకున్న లక్ష్యాలను చేరుకొనే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పారు. తమకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గురుకులాల కార్యదర్శి పావన మూర్తి, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *