-36వ డివిజన్ లో స్థానికులతో కలిసి మొక్కలను నాటిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 36వ డివిజన్ ముదునూరి వారి వీధిలో పర్యావరణ హితానికై చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమ స్ఫూర్తితో హరిత నగరాలకు మద్ధతుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వివరించారు. తెలుగుదేశం హయాంలో పర్యావరణ పరిరక్షణకై ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా పార్కుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. తాను మరలా ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో 80 శాతం వరకు పార్కుల పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఆ పార్కుల సంరక్షణ బాధ్యతలను అధికారులతో పాటు స్థానికులు సైతం స్వీకరించాలని కోరారు. పచ్చదనం పరిఢవిల్లితేనే మానవాళి మనగడ సాధ్యమవుతుందన్న విషయాన్ని బాధ్యతగల పౌరులందరూ గ్రహించాలన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రతి డివిజన్ లోనూ కనీసం వెయ్యి మొక్కలు నాటే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మల్లాది విష్ణు వివరించారు. అనంతరం స్థానికులతో కలిసి ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జగనన్న పచ్చోతరణం కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా.. తమ సొంత కార్యక్రమంగా భావించి ముందుకు వచ్చిన స్థానికులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
జ్యోతి, స్థానిక మహిళ మాట్లాడుతూ.. స్థానిక సత్యనారాయణ స్వామి దేవాలయం చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని తన దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకుంటామని ఈ సందర్భంగా స్థానికులు తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఏఈలు వెంకటేష్, రామకృష్ణ, స్థానికులు మాజేటి భవానీప్రసాద్, రాము, చింతా మురళి, ముళ్లపూడి ఫణి బాబు, చిన్నారులు పాల్గొన్నారు.