Breaking News

విద్యుత్ రంగాన్ని దేశంలో నెంబర్ వన్ చేస్తాం…

-వినియోగదారులకు 24x 7 నాణ్యమైన విద్యుత్ పుష్కలంగా అందించటమే ప్రభుత్వ లక్ష్యం
– ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
-రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ రంగానిదే కీలక పాత్ర
-రాష్ట్రంలో మరింతగా పెరగనున్న విద్యుత్ డిమాండ్
-2017-18 తో పోలిస్తే 2021-22 నాటికి 21. 6 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం
-భవిష్యత్ విద్యుత్ డిమాండ్ చేరుకునేందుకు కీలక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
-ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో విద్యుత్ రంగానిదే కీలక పాత్ర
-భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
-ఇప్పటికే విద్యుత్ ఉపత్తిలో పునరుత్పాదక ఉత్పత్తి సామర్థ్యం 40 శాతం
-పునరుత్పాదక ఇంధనం తో ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్
-విద్యుత్ ఎగుమతే లక్ష్యంగా పునరుత్పాదక ఇంధన ఎగుమతి పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
-24x 7 నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనా , ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల
-పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల వల్ల వివిధ జిల్లాల్లో మెరుగుపడనున్న అభివృద్ధి , ఉపాధి అవకాశాలు
-విద్యుత్ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు కూడా పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం , అభివృద్ధే లక్ష్యంగా విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడం , ఇంధన భద్రతను సాధించటం ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. దుర్గాష్టమి సందర్భంగా ఇంధన శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఇంధన శాఖ మంత్రి మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్లో కూడా 24×7 నిరంతర విద్యుత్ సరఫరా తో పాటు, రైతులకు పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కు ఢోకా లేకుండా ప్రభుత్వం అనేక నిర్మాణాత్మక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.
ఆర్థిక , పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవడంతో విధ్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పారిశ్రామికీకరణ తో పాటు , గ్రామాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల పై ప్రత్యేక దృష్టి సారించినందున రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2017-18 లో 50,077 మిలియన్ యూనిట్లు ఉండగా 2021-22 లో 60943 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు. అంటే 21. 6 శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికీ రోజుకు 250 మిలియన్ యూనిట్లు మేరకు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కు విద్యుత్ రంగ అభివృద్ధి అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో కూడా విద్యుత్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ దృష్ట్యా వినియోగదారులకు అవాంతరాలు లేని నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని అనేక రేట్లు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు . ఏపీజెన్కో ఆధ్వర్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) స్టేజి 2 (1x 800 మెగా వాట్లు ) ఈ నెలాఖరు నాటికి , అలాగే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) లో స్టేజి 5(1x 800 మెగావాట్ల) వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అయితే విద్యుత్ డిమాండ్ అందుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగం పై కీలకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు , ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించాలానే ప్రభుత్వ లక్ష్యానికి పునరుత్పదాక విద్యుత్ విశేషంగా దోహద పడుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020 ను ప్రకటించిందన్నారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున సౌర , పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు తో పాటు, 33 గిగా వాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టులను కూడా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు . ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తయితే రాష్ట్రంలో పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉండటమేగాక ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ ను ఎగుమతి చేయగల స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ చేరుకుంటుందన్నారు.
అలాగే వివిధ జిల్లాలో ఈ పునరుత్పాదక ఇంధనం ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల ఆ జిల్లాలో అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. స్థానికంగా ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు.
ముఖ్యంగా 24x 7 విద్యుత్ పుష్కలంగా ఉండటం వలన పెట్టుబడదారుల్లో భరోసా ఏర్పడుతుందని , అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికీకరణకు దోహద పడుతుందని తెలిపారు. ఈ దృష్ట్యా 24x 7 నిరంతర నాణ్యమైన విద్యుత్ పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారని మంత్రి తెలిపారు . విద్యుత్ రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం, ప్రజలకు 24x 7 విద్యుత్ సరఫరా పుష్కలంగా అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన స్పష్టం చేసారు . అలాగే రైతులకు రానున్న 30 ఏళ్ల పాటు పగటి పూట ఉచిత విద్యుత్ కు భరోసా ఏర్పడేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( సెకి) నుంచి 7000 మెగావాట్ల కు సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకునట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర మొత్తం స్థాపిత విద్యుత్ లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 40 శాతం చేరుకుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మంత్రికి వివరించారు . దీని పై మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల భవిష్యత్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో నంబర్ 1 అవటం ఖాయం అని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం దాదాపు రూ 40 వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని మంత్రి తెలిపారు .
విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఏ చర్యలైన తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదని మంత్రి స్పష్టం చేసారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తితో పాటు రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య రంగాన్ని పెధ్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు , విద్యుత్ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న విద్యుత్ రంగ ఉద్యోగులకు మంత్రి దుర్గాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు . ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని తెలిపారు.
అలాగే జాతిపిత మహాత్మా గాంధీజీ 153వ జయంతి సందర్భంగా, రాష్ట్రంలోని దాదాపు 1.9 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు నిరంతర , నాణ్యమైన 24X7 విద్యుత్ సరఫరాను అందించడానికి విద్యుత్ రంగంలో గాంధీ సూత్రాలను విద్యుత్ సంస్థలు అమలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సిఎండి ఏ పీ ట్రాన్స్కో బి శ్రీధర్, జె ఎం డీ ఏ పీ ట్రాన్స్కో ఐ పృధ్వీ తేజ్, డిస్కమ్ల సిఎండీలు జె పద్మ జనార్దన రెడ్డి , కె సంతోషరావు, నెడ్క్యాప్ ఎండీ, ఎస్ రమణా రెడ్డి , డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి కూడా దుర్గాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *