విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర ప్రజలను వైసిపి నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం విశాఖ జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నారని, అటువంటి బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి చీడపురుగులాగా ప్రవేశించి భూదందాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. డెవలప్మెంట్ పేరుతో అక్రమంగా భూములు కొట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. భూముల అక్రమ డెవలప్మెంట్ దందాల్లో 99% వైసీపీ వాళ్లు కొట్టేసి భూ యజమానులకు కేవలం 1% ఇస్తున్నారని విమర్శించారు. విశాఖ ప్రజలను విజయసాయిరెడ్డి తదితర వైసిపి నాయకులు దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు.
విజయసాయిరెడ్డి తనకి విశాఖలో ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్నారని అయితే విజయ్ సాయి కుమార్తె , అల్లుడు లక్షల చదరపు అడుగుల భూములను అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నారని ఏడుకొండలు వివరించారు. విశాఖ జిల్లాలో కొన్ని వేల ఎకరాలను వైసీపీ వాళ్లు కబ్జా చేస్తున్నారని అన్నారు. వైసీపీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ,అమర్నాథ్ తదితరులు తమ ఆస్తులు పెంచుకోవడం తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విశాఖకు వచ్చిన పరిశ్రమలు అన్ని జగన్ సీఎం అయ్యాక వెనక్కి పోయాయని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయకుండా వైసిపి నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారని ఏడుకొండలు విమర్శించారు.
అమరావతిలో రాజధాని కోసం తమకున్న 36వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్ర పై వైసిపి నాయకులు అడ్డగోలుగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. రైతుల పాదయాత్ర పై విషం చిమ్మడం సరికాదని హెచ్చరించారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి దందా ఏమిటని ఏడుకొండలు ఘాటుగా ప్రశ్నించారు. బీసీలకు నామ్ కే కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వైసీపీ కనీసం వారికి కుర్చీలు కూడా లేకుండా చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని, అన్యాయంగా సిఐడి కేసులు బనాయిస్తున్నారని ఏడుకొండలు ధ్వజమెత్తారు. వైసిపి ప్రభుత్వ అన్యాయాలపై తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రతి తెలుగు వ్యక్తి పోరాటం చేయాలని ఏడుకొండలు అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ఆనాడు వైసిపి నేతల అక్రమాలపై చర్యలు తీసుకుని వారిని జైలుకు పంపించడం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పేరాబత్తుల రమణ, బూదాల నందకుమారి తదితరులు పాల్గొన్నారు.