మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే నెల 8 న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల సందర్భంగా సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని స్పందన మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో పాండురంగ స్వామి ఉత్సవాలపై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన కార్తీక పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు సముద్ర స్నానాలు సరిగా జరగలేదన్నారు. 2019 సంవత్సరం తర్వాత భగవంతుని దయతో కోవిడ్ ఉధృతి తగ్గిన కారణంగా ఈ ఏడాది సముద్ర స్నానమాచరించేందుకు 1.50 లక్షల నుంచి రెండు లక్షల మంది వరకూ సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఘనంగా చేయాలన్నారు. మంగినపూడి బీచ్ వద్ద 125 కేవీ మూడు జనరేటర్లు సంసిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీ ఏర్పడితే చక్కదిద్దేందుకు మూడు క్రేన్లు అత్యవసరమన్నారు. చిలకలపూడి కూడలి, శిరివెళ్ల పాలెం, బీచ్ వద్ద పార్కింగ్ ఏరియా వద్ద వీటిని ఉంచాలన్నారు. అలాగే మూడు ప్రైవేట్ అంబులెన్స్ మంగినపూడి బీచ్ వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 108 104 అంబులెన్స్ సేవలను ఉపయోగించరాదన్నారు. మన జిల్లా నుండే కాక గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి కూడా యాత్రికులు వచ్చే అవకాశం ఉందన్నారు. మచిలీపట్నం బస్టాండ్ నుండి బీచ్ వద్ద బడ్డీల సెంటర్ వరకు కనీసం 50 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. బడ్డీల సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని, ఆటోలకు, ప్రయివేటు వాహనాలకు వేరుగా పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏడు చోట్ల మెడికల్ క్యాంపులను నిర్వహించాలని వైద్య శాఖకు ఎమ్మెల్యే పేర్ని నాని సూచించారు. డెకరేషన్ లైటింగ్ తో పాటు ఫ్లడ్ లైట్లు అమర్చాలన్నారు బడ్డీల సెంటర్ పార్కింగ్ వద్ద నుండి వృద్ధులు, వికలాంగులను బీచ్ వరకు తీసుకెళ్లటానికి రవాణాశాఖ 8 ఆటోలు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాటరీ ఆటోల ఏర్పాటు విషయమై పరిశీలించాలన్నారు. నవంబర్ మూడో తేదీ నుంచి సందర్శకులు పాండురంగ దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. ఈ నెలాఖరు నుండి దేవాలయంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్వహిస్తున్న పూజలు వినపడే విధంగా మైక్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రథోత్సవం సందర్భంగా నగరంలో ఊరేగింపు నిర్వహిస్తారని, నగరంలో పండుగ వాతావరణం కల్పించేలా ప్రధాన వీధుల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సముద్రం ఒడ్డున యాత్రికుల రద్దీని నియంత్రించటానికి బీచ్ వద్ద 200 మీటర్లకు ఒకటి చొప్పున బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు. సముద్రస్నానం ఆచరించిన అనంతరం సందర్శకులు దత్తాశ్రమాన్ని సందర్శిస్తారన్నారు. అక్కడ కూడా బారికేడ్లు ఏర్పాటు చేయాన్నారు. బీచ్‌లో శానిటేషన్ నిరంతరం నిర్వహించేందుకు పారిశుధ్య సిబ్బందిని మూడు షిప్టుల్లో ఏర్పాటుచేయాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ మహిళా కానిస్టేబుల సముద్ర స్నానాలకు దేవాలయాల సందర్శనకు సందర్శకులు ఉపవాసంతో వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, బిపి, షుగర్ అత్యావసర మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. కోవిడ్ నియంత్రణకు సందర్శకుల క్యూల వద్ద శానిటైజర్లు, మాస్క్ లు అందజేయాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా తాగునీటి సరఫరాకు ఎనిమిది ప్రాంతాల్లో వాటర్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు, పలు ట్యాంకర్లతో నీళ్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే నీటి డ్రమ్ములు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలలో స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయలన్నారు. హోటళ్ల వద్ద పరిశుభ్రమైన ఆహారం అందించేలా అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. బీచ్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మెరైన్ పోలీసుల పహారాతో పాటు కనీసం 10 బోట్లు, ఒక్కొక్క బోటుకు కనీసం 6 మంది గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు ఏర్పాట్లు చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. పెదపట్నం బీచ్, సాగర సంగమం వద్ద బోట్లు, గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. బీచ్‌లో పోలీసు శాఖ ద్వారా ఎత్తైన టవర్లు పైనుంచి బైనాక్యూలర్ల ద్వారా పరిశీలన మైకు ద్వారా హెచ్చరికలు చేసే ఏర్పాట్లు చేయాలన్నారు. సిసి కెమెరాలను ఏర్పాటుచేయాలన్నారు. ప్రజలకు మైకు ద్వారా సమాచారాలను చేరవేయటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. దేవదాయశాఖ ద్వారా సందర్శకులకు పులిహోర ప్యాకెట్లు అందించాలన్నారు. స్థానిక కృష్ణా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ ఎన్ సిసి విద్యార్థినీ విద్యార్థులు స్వచ్చంద సంస్థల సేవలు వినియోగించుకోవాలన్నారు. చిలకలపూడి గేట్ నుండి బీచ్ వరకు జంగిల్ క్లియరెన్సు చేయాలన్నారు. ఆర్ అండ్ బి అధికారులు జంగిల్ క్లియరెన్స్ తో పాటు ఆయా ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలన్నారు. ఐసిడిఎస్ ద్వారా చిన్నపిల్లలకు పాలు సరఫరా ఏర్పాట్లతో పాటు తప్పిపోకుండా ట్యాగింగ్ చేయటానికి సిబ్బందితో బందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా బెల్టు షాపులు నియంత్రించాలన్నారు. అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు.
ఈ సమావేశంలో అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, ఆర్‌డిఒ ఐ కిషోర్, డ్వామా పిడి జివి సూర్యనారాయణ, ముడా విసి నారాయణరెడ్డి, తహసిల్దార్ సునీల్ బాబు, మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, డిఎస్‌పి మాసుంబాషా, మహబూబ్ బాషా,డిపిఒ నాగేశ్వర్ నాయక్, ట్రాఫిక్ డిఎస్పి భరతమాతాజి, డి సి ఓ వి వి ఫణి కుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సత్యనారాయణ రాజు, ఏ ఈ సుగుణ, తాళ్లపాలెం మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …