-అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలకు జిల్లాలో అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసంలో ఒకేరోజులో పంచారామాల దర్శనానికి జిల్లాలోని అన్ని డిపోల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని జిల్లా ప్రజా రవాణా అధికారి జి నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం మచిలీపట్నం డిపోలో పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ కార్తీక మాసంలో ఒకేరోజులో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలను దర్శించినచో కోటి తీర్థముల దర్శించిన ఫలము కలుగునని, భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం డిపోల నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ప్రయాణికులు ఈ సౌకర్యమును వినియోగించుకోవాల్సిందిగా కోరారు. కార్తీక మాస సముద్ర స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈనెల 8వ తేదీన మంగినపూడి బీచ్ వరకు 50 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. నవంబర్ 16 నుండి శబరిమలై దర్శనం ప్రత్యేక ప్యాకేజీ క్రింద స్పెషల్ హైర్ చార్జెస్ తో బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదవకాశమును వినియోగించుకోవాల్సిందిగా కోరారు. మచిలీపట్నం డిపో మేనేజర్ టి పెద్దిరాజు, వివిధ డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.