మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తులు నేరుగా స్వామివారి పాదాలు తాకి పూజించేందుకు అవకాశం ఉన్న ఏకైక మహిమ గల గొప్ప పుణ్యక్షేత్రం మచిలీపట్నం చిలకలపూడిలోని పాండురంగస్వామి ఆలయం మాత్రమేనని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు.
గురువారం ఆయన చిలకలపూడి పాండురంగస్వామీ దేవస్థానం వద్ద కార్తీక మాస ఉత్సవాల పురస్కరించుకొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే పేర్ని నానికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శాసనసభ్యులు పేర్ని నాని ఈ దేవాలయ విశిష్టత గూర్చి మాట్లాడుతూ, మహారాష్ట్ర లోని పండరీపురం తరువాత అంతటి మహిమగల గొప్ప పుణ్యక్షేత్రం చిలకలపూడి లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయమన్నారు. ఆలయ స్థల పురాణానికి వస్తే, శ్రీ పండరిపురంలో నరసింహుడు అనే భక్తుడు నిత్యం ఆ పాండురంగ స్వామిని సేవిస్తూ ఉండేవాడని అయితే మహీపతి మహారాజు వద్ద తారకమంత్రం, విఠల్ మంత్రాలను జపిస్తూ ఉండేవాడు. ఆ భక్తుడు 1905 లో మచిలీపట్నం చిలకలపూడి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని, జ్ఞానేశ్వర తుకారాం అనే ఒక మఠాన్ని స్థాపించి పాండురంగనికి భజనలు చేస్తుండేవాడన్నారు. ఒకరోజు ఆ స్వామి ఇతడి కలలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మిస్తే స్వయంభువుగా అవతరిస్తానని చెప్పాడు. అప్పుడు స్వామి ఆదేశాల మేరకు నరసింహుడు ఐదు ఎకరాలలో పాండురంగని ఆలయాన్ని నిర్మించాడని, పాండురంగ స్వామి స్వయంభువుగా వెలుస్తునట్లు అందరికి వార్త అందడంతో కొన్ని వేలమంది ప్రజలు ఆలయం చుట్టూ చేరారని అన్నారు. ఆనాడు బ్రిటీష్ అధికారులు ఆలయానికి సీలు వేయగా, ఆ పాండురంగ స్వామి స్వయంభువుగా అవతరించకపోతే స్వామివారిలో లీనమైపోతానని నరసింహుడు ప్రతిజ్ఞ చేసాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆలయంలో పెద్ద శబ్దం వినిపించి. వెంటనే ఆలయం తలుపులు తెరుచుకోగా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన పాండురంగడు భక్తుల సమక్షంలో ఈ ప్రాంతంలో వెలిశారని ఎమ్మెల్యే పేర్ని నాని వివరించారు.
ఇక అప్పటినుండి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు. ఈ స్వామివారికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టం. ఇంకా భజనలు అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తూ భక్తి భావంతో భజనలు చేస్తూ స్వామివారిని అర్చించి స్వామివారి అపార కృపకు పాత్రులవుతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్, పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులు, పాండురంగస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …