-దేవాదాయ శాఖకు స్వాత్మానందేంద్ర స్వామి సూచన
-పాత శివాలయాన్ని సందర్శించిన స్వామీజీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో పురాతన ప్రాశస్త్యమున్న పాత శివాలయాన్ని విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సందర్శించారు. సోమవారం ఆయన శివాలయానికి వెళ్ళారు. ఆలయంలో ధర్మరాజు ప్రతిష్టించిన శివలింగానికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం భ్రమరాంబికా అమ్మవారి ఆలయంలోనూ పూజలు చేసి హారతులిచ్చారు. కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నిర్వహించే విశేష పూజలను వీక్షించారు. ఆలయ పండితులు అధికారులు స్వామీజీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చాళుక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలి గురించి పండితులు వివరించారు. వేల సంవత్సరాల నాటి శాసనాలను స్వాత్మానందేంద్ర స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి పురాతన సంపదగా పేరున్న ఆలయాలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పూర్వకాలపు నాటి రాతి కట్టడాలు మరుగున పడేలా సిమెంటుతో మరమ్మత్తులు చేయరాదన్నారు. ప్రాచీన సంపదను భావి తరాలకు అందించేలా చూడాలని సూచించారు. స్వాత్మానందేంద్ర స్వామి వెంట అర్చక అకాడమీ డైరెక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి తదితరులు ఉన్నారు.