Breaking News

పేదల జీవితాల్లో వెలుగే లక్ష్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల ఉన్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ వీధులలో విస్తృతంగా పర్యటించి.. 320 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. కాలనీలో నూతన రోడ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక లబ్ధిపై స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలన పేదలకు ఏమాత్రం ఉపయోగపడలేదని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి.. పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారన్నారు. అనంతరం ప్రజలతో మమేకమై గ్రీవెన్స్ స్వీకరించారు. జగనన్న కాలనీలలో పట్టాలు మంజూరైన లబ్ధిదారులకు క్లస్టర్ల వారీగా ఇళ్ల నిర్మాణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని పొదుపు సంఘాల ఆర్.పి.లకు సూచించారు. రాత్రుళ్లు ఆగంతకులు కాలనీలోకి ప్రవేశించకుండా.. రైల్వే ట్రాక్ వెంబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సచివాలయ పరిధిలో రూ. 4.47 కోట్ల సంక్షేమం
211 వ వార్డు సచివాలయ పరిధిలో గత మూడేళ్లలో రూ. 4.47 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 174 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 194 మందికి రూ. 27.02 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 87 మందికి రూ. 12.79 లక్షలు., చేయూత ద్వారా 69 మందికి రూ. 12.93 లక్షలు., కాపునేస్తం ద్వారా 18 మందికి రూ. 2.70 లక్షలు., జగనన్న తోడు ద్వారా 22 మందికి రూ. 2.20 లక్షలు., వాహనమిత్ర ద్వారా 34 మందికి రూ. 3.40 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. కరోనా కష్టకాలంలోనూ ఎక్కడా పేదల సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అనేక మంది ఆర్థికవేత్తలు సైతం కీర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

టీడీపీ ఒక అబద్ధాల ఫ్యాక్టరీ
తెలుగుదేశం పార్టీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. మరీముఖ్యంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరని.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రోజుకో అబద్ధాన్ని ప్రజల్లోకి వదులుతూ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబుకు షరామామూలైందని మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు అవినీతి పాలనలో అస్తవ్యస్థంగా మారిన వ్యవస్థలను.. ఈ ప్రభుత్వం గాడిన పెడుతున్నట్లు తెలియజేశారు. మరోవైపు చిట్ ఫండ్, ఫైనాన్స్ అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. పేద, సామాన్య ప్రజలు కడుపు కట్టుకుని దాచుకున్న డబ్బుల విషయంలో అవకతవకలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం నటశేఖరుని కుటుంబ సభ్యులు, అభిమానులకు మరోసారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు బెజ్జం రవి, పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల జయకర్, సామంతపూడి గోవిందరాజు(చిన్నా), అంగిరేకుల విజయ్, భోగాది మురళి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *