-పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్. సురేష్ కుమార్
-ఐఐఎంఏలో ఐదు రోజుల పాటు శిక్షణ పొందుతున్న 50 మంది ప్రధానోపాధ్యాయులు
-వినూత్న బోధనాలోచనలకు కృషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని గుణాత్మక విద్య, వినూత్న బోధన ఆలోచనలకు నాంది పలికేలా ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా తరఫున స్యీమాట్ (State Institute of Educational Management and Training)విభాగం ప్రతిష్ఠాత్మకమైన విద్యా అగ్రగామి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (అహ్మదాబాద్)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్. సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన రాష్ట్రం తరఫున సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఒప్పందం పత్రాన్ని ఐఐఎంఏ ప్రోగ్రాం ఫ్యాకల్టీ విభాగధిపతి ప్రొఫెసర్ కాథన్ శుక్లా, ప్రొఫెసర్ నెహరికా వొహ్రలకు అందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 50 మంది ప్రధానోపాధ్యాయులు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్/ ప్రధానోపాధ్యాయులు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ సామర్థ్యాల కోసం లక్షణాలు పెంపొందించడం, స్కూల్ ప్రిన్సిపాల్ పాత్ర, పాఠశాల వాతావరణంలో అభ్యసన సంసిద్ధత, పాఠశాల క్రమశిక్షణ : పునరుద్ధరణ పద్ధతులు, మెరుగైన అభ్యాస పర్యావరణం కోసం విద్యార్థుల భావోద్వేగాలను గుర్తించడం, ఆసక్తికరమైన వినూత్న బోధన, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం తదితర అంశాలపై ఐఐఎం శిక్షణ ఇవ్వనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి , పాఠశాల విద్యాశాఖ, సీమ్యాట్, సమగ్ర శిక్షా నుంచి ప్రతినిధులు పాల్గొన్నారని కమీషనర్, ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.