-జిల్లాలో నాలుగు వేల మందికి వైఎస్సార్ ఆసరా, చేయూత లబ్ది కల్పిస్తున్నాం..
-కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలలో స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు పాడి గెేదలను పంపిణీ చేసి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన రైతులకు స్వయం సహాయక సంఘాల మహిళలకు గురువారం కంకిపాడు మార్కెట్ యార్డు నందు జిల్లా కలెక్టర్ డిల్లీరావు పాడిగెేదలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతాంగాన్ని, స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. చిరువ్యాపారులు, మహిళలు, రైతులు వారి అవసరాల నిమిత్తం ప్రైవేట్ వ్యక్తుల నుండి అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పాడి గేదలను పంపిణీ చేసి తద్వారా వచ్చే ఆదాయంతో అవసరాలను తీర్చుకోవాలన్నదే ఫ్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో నాలుగు వేల మంది లబ్దిదారులకు పాడిపశువులను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. జనవరి మాసాంతానికి రెండువేల మంది లబ్దిదారులకు పాడి పశువులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు గంపలగూడెం, రెడ్డిగూడెం, వీరుళ్ళపాడు, జి. కొండూరు మండలాలకు చెందిన లబ్దిదారులకు పాడి గేదలను పంపిణీ చేస్తున్నామన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో లబ్దిదారులు వారికి అనువైన గ్రామంలో ఉండి పంపిణీ చేయనున్న గేదల పాల దిగుబడిని రెండు రోజుల పాటు ప్రత్యక్షంగా పరిశీలించి వారి సంతృప్తితో పశుసంవర్థక శాఖ అధికారులు నిర్థేశించిన మేరకు గేదలను కొనుగోలు చేసేకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు పాల ఉత్పత్తులను అమూల్ పాలసేకరణ కేంద్రాలలో విక్రయించుకోవడం ద్వారా గిట్టుబాటు ధర పొందేలా చర్యలు తీసుకున్నామన్నారు. పిబ్రవరి మాసాంతానికి నాలుగు వేల పాడి పశువులను పంపిణీ చేసే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. లబ్దిదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతులు స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు.
కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్, జడ్పిటిసి బి. కోటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.