-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం అవతల జాతీయ రహదారి 16 లోని పొట్టిపాడు నుంచి ఉయ్యూరు మీదుగా గుంటూరు వైపు కాజ వరకు 50 కిలోమీటర్లు జాతీయ రహదారి పనులను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులతో ఆయన విజయవాడ తూర్పు, పశ్చిమ బైపాస్ నిర్మాణం జాతీయ రహదారి ఏర్పాటు విషయమై సమీక్షించారు. విజయవాడ తూర్పు వైపు నిర్మించాలనుకుంటున్న మరొక బైపాస్ కు అధికారులు 4 ప్రతిపాదనలు చేశారని చెబుతూ, ఇందులో గన్నవరం అవతల జాతీయరహదారి-16లోని పొట్టిపాడు నుంచి గుంటూరు వైపు కాజ వరకు 50 కి.మీ. మేర ఉన్న ప్రతిపాదనపై ఆర్ అండ్ బి ఇంజినీర్లు ఆసక్తి చూపుతున్నారన్నారు. దీనికి మద్దూరు వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మించేలా ప్రణాళిక సైతం రూపొందించారన్నారు. మిగిలిన 3 ప్రతిపాదనలకంటే ఇది సరైనదనే అభిప్రాయాన్ని ఎన్ హెచ్ అధికారుల వద్ద వ్యక్తం చేశారని తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.1,200- నుంచి1,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అలాగే భూసేకరణకు రూ.400-500 కోట్లు అవసరం కాగా.. దీన్ని రాష్ట్రమే భరించాలని జాతీయ రహదారి అధికారి వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సీనరేజ్ ఫీజు, జీఎస్టీ మినహాయించాలని కేంద్రం కోరగా, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సంబంధిత అధికారి చెప్పారు. కొత్త రహదారిలో సీనరేజ్, జీఎస్టీ తదితరాలన్నీ మినహాయిస్తే రూ.100 కోట్లు ఎన్ హెచ్ ఏ ఐ కల్గిస్తాయన్నారు.. అయితే ఈ ప్రాజెక్టులో భూసేకరణ వ్యయం రూ.500 కోట్ల వరకు ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ఎన్ హెచ్ ఏ ఐ ప్రాజెక్టుల్లో కూడా సీనరేజ్, జీఎస్టీ మినహాయింపుల నివ్వాలని కేంద్రం కోరుతున్నట్లు తెలిసింది. ఈ అంశాన్ని రాష్ట్రం పరిశీలిస్తోందన్నారు. ఈ బైపాస్ కోల్‌కతా నుండి చెన్నైకి ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఎన్ హెచ్-16 లో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ట్రాఫిక్‌ను వేగంగా, సురక్షితమైన తరలించడానికి ప్రతిపాదించబడిందని తెలిపారు. ఇది ఎన్ హెచ్-65 వివిధ రాష్ట్ర, జాతీయ రోడ్లను కూడా కలుపుతుందని తెలిపారు. ప్రతిపాదిత బైపాస్ అలైన్‌మెంట్ పొట్టిపాడు గ్రామం (టోల్ ప్లాజా దగ్గర) నుండి ప్రారంభమై, కృష్ణా, గుంటూరు జిల్లాల గుండా గుంటూరు సమీపంలోని చినకాకాని గ్రామం సమీపంలో ఎన్ హెచ్-16 లో ముగుస్తుందన్నారు. మొత్తం 49 కిలోమీటర్ల .270 మీటర్లు పొడవు గల ఈ మార్గంలో దాదాపు 29 కిలో మీటర్ల 500 మీటర్లు (సుమారు) కృష్ణా జిల్లా గుండా అలాగే 19 కిలోమీటర్లు 770 మీటర్లు (సుమారు) గుంటూరు జిల్లా గుండా వెళుతోందని తెలిపారు. కృష్ణాజిల్లాలో ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు, ఉయ్యూరుతో కలిపి మొత్తం ఆరు మండలాలు కాగా, అలాగే గుంటూరు జిల్లాలో కొల్లిపర, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి 4 మండలాలు ఉన్నాయన్నారు. ఈ సమీక్ష సమావేశం లో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, మచిలీపట్నం ఆర్డిఓ ఐ. కిషోర్, గుడివాడ ఆర్టీవో పద్మావతి, నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్, ధ్రువ కన్సల్టెన్సీ ఉద్యోగులు, సర్వే, ఫారెస్ట్, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, జాతీయ రోడ్లు భవనాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.