-ఇవాళ గుంటూరులోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ లో బాధ్యతల స్వీకరణ
-కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారిగా ఆర్. రమేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, గుంటూరు క్షేత్ర కార్యాలయంలో ఆయన ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరం ఇన్ఫర్మేషన్ సర్వీస్ లలో ప్రవేశించిన రమేష్ చంద్ర… న్యూఢిల్లీలోని పత్రికా సమాచార కార్యాలయంలో వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలకు మీడియా అధికారిగా పనిచేసిన ఆయన, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ ప్రధానులుగా ఉన్న కాలంలో 8 ఏళ్ళ పాటు ప్రధానమంత్రి కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం లడఖ్ (లద్దాఖ్)లోని ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ కార్యాలయాల వార్తావిభాగ అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రమేష్ చంద్రను గత నెలలలో గుంటూరు క్షేత్ర ప్రచార అధికారిగా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నాడు అనగా 8 ఫిబ్రవరి 2023న గుంటూరు కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఉభయ జిల్లాల్లో క్షేత్ర స్థాయికి తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.