రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో, స్వచ్ఛంధ సేవ సంస్థలతో సమావేశం నిర్వహించారు.
అసంఘటిత కార్మికులకు వారి హక్కులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించాలని పేర్కొన్నారు . ఆమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ విషయంలో స్వచ్చంధ సేవా సంస్థల వారు సంబంధిత అధికారులకు సహకరించా లన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారం చూపేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రెండు వారాల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ నివేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని ఆదేశించారు. “నల్సా – అసంఘటిత కార్మికులకు న్యాయ సేవల పథకం, 2015” ద్వారా న్యాయ సేవాధికార సంస్థలు అందిస్తున్న సేవల గురించి వివరించారు.
డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి కే. ప్రత్యూష కుమారి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థల వారు ఈ సమావేశానికి హాజరయ్యారు.