-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 239 & 260 వ వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మారుతున్న పేదల జీవన ప్రమాణాలే అభివృద్ధికి సూచికలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 58 వ డివిజన్ 239 & 260 వ వార్డు సచివాలయాల పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆంధప్రభ కాలనీ, వశిష్ట కాలనీ, బొమ్మరిల్లు అపార్ట్ మెంట్ల పరిధిలో విస్తృతంగా పర్యటించి.. 239 గడపలను సందర్శించారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. కొత్తగా వచ్చిన వారికి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని వాలంటీర్లకు సూచించారు. గత నాలుగున్నరేళ్లలో 260 వ వార్డు సచివాలయ పరిధిలో రూ. 3.26 కోట్ల సంక్షేమాన్ని అందజేయగా.. 239 వ వార్డు సచివాలయ పరిధిలో రూ. 5.18 కోట్ల నగదును వివిధ పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలని వీఎంసీ సిబ్బందికి సూచించారు.
2014 ఉమ్మడి మేనిఫెస్టో ఏమైంది..?
2014–19 మధ్య ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడుందో టీడీపీ-జనసేన నాయకులకు కూడా తెలియదని మల్లాది విష్ణు విమర్శించారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 99.50 శాతం నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల హృదయాలలో సుస్థిరంగా, చెరగని ముద్ర వేసుకుంటున్నాయన్నారు. కనుకనే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ జగనన్నే మరలా తమ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. పేదలకు చేస్తున్న మంచిని కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చంద్రబాబు, పవన్, లోకేష్ లకు ఏమాత్రం పట్టవని మల్లాది విష్ణు ఆరోపించారు. మరలా ఎవరిని మోసం చేయడానికి ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో తయారవుతున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే టీడీపీ హయాంలో సాధించిన ప్రగతి, అందించిన సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 11న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నందు జరుగు మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, ఉమ్మడి వెంకట్రావు, శర్మ, గోపాల్ రెడ్డి, వసంత్, వజీర్, తోపుల వరలక్ష్మి, శోభన్, మహేశ్వరి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.