-రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బొప్పరాజు & సుమన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతను చాటుతూ డిసెంబర్ 10వ తేదీన జరప తలపెట్టిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రధమ సభకు వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరై జయప్రదం చేయాలని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని రెవెన్యూ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభకు సంబంధించిన పోస్టర్ను, కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ సుమన్ మాట్లాడారు. ఏళ్ల తరబడి ప్రైవేటు ఏజెన్సీల కబంధహస్తాల్లో శ్రమ దోపిడీకి గురైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ ను ఏర్పాటు చేసి కొంతమేరకు రక్షణ కల్పించిందని అందుగ్గాను ఏపీ జేఏసీ అమరావతి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే, మిగిలిన సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించే దిశగా చొరవ చూపాలని కోరారు. ఈ మహాసభ వేదికనుండే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రావలసిన న్యాయమైన సమస్యలు అనగా వేతనాలు పెంచాలని, సీనియార్టీ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపచేయాలని ఇంకా పలు సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. డిసెంబర్ 10వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగే ఈ మహాసభకు ప్రభుత్వ పెద్దలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ, రాష్ట్ర స్థాయి శాఖాధిపతులు కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, రాష్ట్ర సచివాలయంలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా ముందుకు సాగి రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభను విజయవంతం చేసి కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ అల్లం సురేష్ బాబు, ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పలిశెట్టి దామోదర్ రావు, రాష్ట్ర కోశాధికారి మురళీకృష్ణమనాయుడు, ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ దొప్పలపూడి ఈశ్వర్ ,రెవెన్యూ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి బత్తిన రామకృష్ణ, సిటీ జేఏసీ చైర్మన్ బి.దుర్గ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ కే.సురేంద్ర, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ.సాంబశివరావు , క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యన్.మల్లేశ్వరరావు, వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.బ్రహ్మయ్య, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి సుశీల, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ సతీష్ జనరల్ సెక్రెటరీ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.