విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు భారత దేశంలో మానవ అక్రమ రవాణా బాధిత మహిళలను వారి పిల్లలును సమాజం నేరస్థులుగా చిన్నచూపు చూస్తున్నారని ఫలితంగా వారు సమాజం లో హింస, దోపిడి, వి వక్షత, చిన్న చూపుకు గురౌతూ మాకు హక్కులు ఉండవు, మేము మనుష్యులం కాదు అనే భావన బాధితుల్లో ఉందని, వారిని సమాజంలో అందరి పౌరులుగా గుర్తించి, వారి హక్కులు పరిరక్షించి, వారికి పునరావాసం కల్పించడంతో పాటు వారిని గౌరవించి సమాజములో మనలగా ఆదరించాలని రాష్ర్ట బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు టి. అదిలక్ష్మీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య విముక్తి మరియు హెల్ప్ సంస్థ సంయుక్తంగా బాధిత మహిళలు తో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిలక్ష్మి మాట్లాడుతూ బాధిత మహిళల పిల్లల రక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర బాలల కమీషన్ చేస్తున్న కృషిని ఆమె వివరించారు. మానవ అక్రమరవాణా నిరోధక విభాగం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి కె.వాసవి మాట్లాడుతూ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా జీవించే హక్కు, గౌరవం, సమానత్వం, సమాన రక్షణ కల్పించాలని ఐక్యరాజ్య సమితి రూపొందించిన ‘‘సార్వత్రిక మానవ హక్కుల తీర్మానం’’ మేరకు భారత దేశ ప్రభుత్వం 1993లో ‘‘మానవ హక్కుల పరిరక్షణ చట్టం’’ రూపొందించడం జరిగిందన్నారు. ఎవరో చిన్నచూపు చూస్తున్నారు అని ఆందోళన, ఆలోచన మానుకొని తమ పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆత్మస్థైర్యం తో ఉండి మంచి జీవితం గడపాలని ఆమె బాధితులను కోరారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి. వి.ఎస్.కుమార్ మాట్లాడుతూ అనేకమంది మహిళలు పరిస్థితులు ప్రభావంతో ఈ వృత్తి లోకి వస్తున్నారని వారిపట్ల చిన్నచూపు తగదని మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగిన అది తప్పేనని ఈ ఉల్లంఘన పిల్లల పట్ల లేదా పెద్దల పట్ల జరిగిన అది నేరం అవుతుందన్నారు.
విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్. అపూర్వ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో షుమారు 1.35 లక్షల మంది మహిళలు వ్యభిచారం ఊబిలో చిక్కుకొని ఉన్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ చెప్తున్నప్పటికీ వారు సెక్స్ వర్కర్లుపై జరుగుతున్న దోపిడి, హింస, వివక్షత నుంచి కాపాడి వారికి మానవ హక్కులను కాపాడేందుకు చర్యలు చేపట్టడం, ఉచిత మానసిక మరియు ఆరోగ్య సేవలు అందించడం, వ్యభిచారం నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్న బాధిత మహిళలకు పునరావాస కార్యక్రమాలు అమలు వంటి వాటిపై దృష్టి సారించకుండా, ఒక్క హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ నియంత్రణ మీదే జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోలు సంస్థలు దృష్టి సారించడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. చాలామంది సెక్స్ వర్కర్లు తమ నిత్య జీవితంలో గృహహింస ఎదుర్కోవడం ‘‘సహజంగా మారింది’’ దీనిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ 2020 అక్టోబర్ నెలలో సెక్స్ వర్కర్లుకు పార్టనర్స్‌గా వ్యవహరించే వ్యక్తులు లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి గృహ హింస ఎదుర్కొంటున్నట్లు పిర్యాదులు వస్తే ప్రొటక్షన్ అధికారులు వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలి అని ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
బారత అత్యున్నత న్యాయస్థానం 2022 మే నెలలో ఇచ్చిన తీర్పు ద్వారా పెద్దవాళ్ళు మరియు సమ్మతితో వ్యభిచారం చేసే మహిళలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికి పాటించకుండా బలవంతంగా ‘‘షెల్టర్ హోమ్‌లకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ షెల్టర్ హోమ్‌లు జైళ్ళు కొన్ని అద్వాన్నంగా ఉన్నాయని అంటూ ఆ హోమ్‌లో బాధితులను నేరస్థులుగా నెలలు, ఏళ్ళతరబడి నిర్బందిసు వారి కుటుంబాలు, వారి పిల్లల నుంచి దూరం చేస్తున్నారు.
విముక్తి రాష్ట్ర కార్యదర్శి బి. పుష్పవతి మాట్లాడుతూ అక్రమ రవాణా బాధితులకు జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ద్వారా అందిచాల్సిన నష్ట పరిహారం అందటంలేదని అంటూ 2016 నుంచి 2022 వరకు జాతీయ నేర గణాంకాల శాఖ లెక్కలు ప్రకారం రాష్ట్రంలో షుమారు 3000 మంది మహిళలు, బాలికలు అక్రమ రవాణా నుంచి రిస్క్యూ అయితే రాష్ట్రంలోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా అయిదుగురికి తప్ప మిగిలిన వారికి నష్ట పరిహారం అందలేదన్నారు.
స్వదార్, ఉజ్వల స్కీం క్రింద రాష్ట్రంలో నడుస్తున్న షెల్టర్ హోమ్‌లో 2019 నుంచి 2023 జూన్ వరకు 2,737 మంది అక్రమ రవాణా బాధిత మహిళలు ఉంటే వారిలో కనీసం 10% మందికి జి.వో 28 క్రింద ప్రభుత్వం ఇచ్చే రూ20,000/` అలాగే, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అందించే లక్ష రూపాయల నష్ట పరిహారం కూడా షెల్టర్ హోమ్స్ యాజమాన్యం బాధితుల ద్వారా ధరఖాస్తులు పెట్టించక పోవడం శోచనీయం. 2022 లో జాతీయ మానవ హక్కుల కమీషన్ సెక్స్ వర్కర్లను ‘‘అనధికార కార్మికులు’’ గా గుర్తించి వారికి అధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఇప్పించి, బ్యాంక్ అకౌంట్స్ ఓపన్ చేయించి అన్ని పథకాలు అందేలా చూడాలి అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినా, నేటికి అమలులోకి రావడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళలకు వ్యాపార లైంగిక దోపిడి బాధిత మహిళలకు ‘‘షెల్టర్ హోమ్’’ ఆధారిత పునరావాసం కాకుండా ‘‘కమ్యూనిటి ఆధారిత పునరావాసం’’ కల్పిస్తూ క్రొత్త జి.వో జారీ చేసి సమాజంలో అందరికి అందే సంక్షేమ పథకాలు అన్నీ అక్రమ రవాణా బాధిత మహిళలు, వ్యాపార లైంగిక దోపిడి బాధితులకు అమలు అయ్యేలా చూడాలని కోరారు.
ఈ సమావేశంలో హెల్ప్ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వి.భాస్కర్ తో పాటు విముక్తి ప్రోగ్రాం అధికారులు కుమారి, షర్మిల, ఈశ్వరి, పార్వతి, జయప్రద తదితరులు పాల్గొన్నారు