-స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎం.డి. గంధంచంద్రుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని సఫాయి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సఫాయి మిత్రయాప్ దోహద పడుతుందని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గంధం చంద్రుడు అన్నారు. మంగళవారం విజయవాడలోని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సఫాయి మిత్ర సర్వేయాప్ ను గంధం చంద్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పురపాలకసంఘాలు, గ్రామ పంచాయితీల పరిధిలో పనిచేస్తున్న సఫాయి కార్మికుల సేవలు అజరామరమని కొనియాడారు. సఫాయి కార్మికుల జీవనోపాధిని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో పని చేసే సఫాయికార్మికుల గుర్తింపు ప్రక్రియలో భాగంగానే ఈ సఫాయి మిత్ర సర్వే యాప్ ను ప్రారంబించామని గంధం చంద్రుడు తెలిపారు. గ్రామాల్లోని సఫాయి కార్మికుల వివరాలను ఆయా గ్రామ సచివాలయ కార్యదర్శులు, పట్టణాల్లో పారిశుద్ద్య విభాగం వార్డు కార్యదర్శులు ఈ యాప్ లో నమోదు చేస్తారన్నారు. ఈ సర్వేకు ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు సహకరించి తమ వివరాలను యాప్ లో నమోదు చేయించుకోవాలని గంధం చంద్రుడు కోరారు.
క్షేత్ర స్ధాయిలో సర్వే సక్రమంగా కొనసాగించిసఫాయి కార్మికుల సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని ఆయన అధికారులనుఆదేశించారు. పారిశుధ్య సేవలు అందించేటప్పుడు ఎటువంటి మరణాలు సంభవించకుండా ప్రమాదరహిత వాతావరణం ఉండేలా తగిన చర్యలు తీసుకోబడతాయని ఆయన వెల్లడించారు. సఫాయికార్మికులకు అత్యవసరసేవలను అందించేందుకు కనీస వేతనాలు నిర్ధారించడంతో పాటుఅధిక ప్రమాదం ఉన్న కార్మికుల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడానికి ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుందని గంధం చంద్రుడు తెలియ జేశారు.