-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై నిన్న విజయవాడలో జరిగిన రాళ్లదాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బస్సుయాత్ర విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగా నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగుడు జగన్మోహన్‌రెడ్డిపై రాయితో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అత్యంత రక్షణ వలయం మధ్య ఉండే ముఖ్యమంత్రిపైనే దాడి జరగడం అమానుషం. రాజకీయాల్లో విమర్శలు, ఆత్మ విమర్శలు ఉండాలేగాని భౌతిక దాడులు తగవని హితవుపలుకుతున్నాం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దాడి ఘటనపై పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల, పోలీసుల వైఫల్యం వెలుగుచూస్తోంది. జగన్‌పై ఈ దాడికి విపక్ష టిడిపి వారే కారకులంటూ అధికార వైసిపి ఒకపక్క చెబుతుండగా మరోప్రక్క రాయిదాడిని కోడికత్తి 2.0కు ప్రతీకగా పేర్కొంటూ సానుభూతి ఓట్లకోసం వైసిపి చేసిన కుట్రగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఈ దాడి ఘటన అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి అస్కారమిచ్చింది. ఈ అనుమానాలు నివృత్తికావాలంటే ఎన్నికల కమీషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. కారకులెవరైనప్పటికీ కఠినంగా శిక్షించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామన్నారు.