-ఏపిటియఫ్ రాష్ట్ర కార్యవర్గం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఏపిటియఫ్ రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి-సింగరాజు భవన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం చెన్నుపాటి మంజుల అధ్యక్షతన జరిగింది. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిందని, ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురిచేసిందని, విద్యారంగంలో సి.బి.యస్.ఈ, ఐ.బి. వంటి విధానాలను ప్రవేశపెట్టి గందరగోళానికి గురిచేసిందని, ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టకుండా ఉపాధ్యాయులపై పనిభారాన్ని మోపిందని, పాఠశాలల విలీన ప్రక్రియతో ప్రాథమిక పాఠశాలల ఉసురుతీసిందనీ, 117 జి.ఓ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తొలగించిందనీ, కొత్త ప్రభుత్వం ఈ పరిస్థితులన్నింటినీ సరిదిద్దాలనీ, ఉపాధ్యాయులు ఆత్మాభిమానంతో ఆత్మ విశ్వాసంతో నిర్ణయంగా పనిచేసే పరిస్థితులను కల్పించాలనీ ఏపిటియఫ్ రాష్ట్ర అధ్యక్షులు తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ యం.యల్.సి పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ వెంటనే క్రొత్త డి.యస్.సి ప్రకటించాలనీ, పి.ఆర్.సిని నియమించాలని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని క్రొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపిటియఫ్ పూర్వ ప్రధానకార్యదర్శి పి. పాండురంగవరప్రసాదరావు మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర, రాష్ట్ర వ్యాపితంగా పటిష్టమైన నిర్మాణం కలిగిన ఏపిటియఫ్కు సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వాన్ని ఇవ్వాలని, ఉపాధ్యాయులపై అమానవీయంగా ప్రవర్తించిన ప్రవీణ్ ప్రకాష్్ప చర్యలు తీసుకోవాలనీ, విద్యా కిట్లు, పాఠ్యపుస్తకాలు, కుంభకోణంపై, నాడు-నేడు, యస్.సి.ఈ.ఆర్.టిలో జరిగిన అవినీతిపై లోతైన విచారణ జరిపి తగుచర్చలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు షేక్ జిలాని మాట్లాడుతూ పటిష్టమైన సంఘ నిర్మాణానికి కృషిచేయాలని, ఫెడరేషన్ దృక్పథంతో పనిచేయుట అలవర్చుకోవాలని, సామాజిక సమస్యలకు స్పందించాలనీ కార్యవర్గానికి ఉద్భోదించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు ఏ. శ్యాంసుందర్రెడ్డి, కోనంకి అశోకుమార్, తమరాన త్రినాధ్, పువ్వాడ వెంకటేశ్వర్లు, యం. అనిత, బుటారి నరసింహులు, డి.సరస్వతి, సయ్యద్ చాంద్ బాషా, బి.రఘుబాబు, యస్. రవికుమార్, కొటాన శ్రీనివాస్, 25 జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు.