– CBC క్షేత్రప్రచార విభాగం కాకినాడ ఆధ్వర్యంలో ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
– కేవీ విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీ, బహుమతుల ప్రదానం
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సాధన మెరుగైన మార్గమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కాకినాడ క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ తెలిపారు. నిత్య జీవితంలో యోగా సాధనతో ఆనందమయమైన జీవితాన్ని అనుభవించవచ్చునని ఆయన వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ (CBC) కాకినాడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వలసపాకల లోని కేంద్రీయ విద్యాలయంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నదని తెలియజేశారు. 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు వ్యక్తిగత & సమాజ అభివృద్ధికి యోగ (#yogaforselfandsociety) అనే థీం ద్వారా వేడుకలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు యోగా విశిష్టతను తెలియజేసేందుకు తమ విభాగం ద్వారా కేంద్రీయ విద్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు భాగస్వామ్య పత్రాలు అందించి అనంతరం హాజరైన వారితో కలిసి ఆయన యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా కాకినాడ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బొంత శేఖర్ మాట్లాడుతూ, భారతదేశ విశిష్ట సంస్కృతిలో యోగా భాగమని తెలిపారు. నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కునేందుకు యోగా సాధన ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ద్వారా అంతర్జాతీయంగా యోగా విశిష్టత తెలుస్తున్నదని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం, ఆనందం సొంతం చేసుకోవచ్చున్నారు. విద్యార్థులు ఏకాగ్రతను సొంతం చేసుకునేందుకు యోగ ఉత్తమమైన మార్గమని శేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.