Breaking News

ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కే చంద్రశేఖర రావు ఆర్ డి ఓ ఎం. వాణిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం ” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు.

మొత్తం 87 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన కుమార్తె రాగనందిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నదని, తాము వెనుకబడిన తరగతులకు చెందిన పేదవారమని, వలస కూలీలుగా ఇతర జిల్లాలకు పొలం పనులకు వెళుతున్నందున సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో తన కుమార్తెకు ప్రవేశం కల్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ అలాగే మిచౌన్గ్ తుఫాను నష్టపరిహారం ఇంకనూ కొంతమంది రైతులకు అందవలసి ఉన్నదని వారికి అందేలా చూడాలని, 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో కురిసిన అకాల భారీ వర్షాలకు బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లో దాదాపు 4,500 మంది రైతులకు సుమారు 3 కోట్ల రూపాయలు పరిహారం ప్రభుత్వం ప్రకటించిందని ఆ మొత్తం విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి మురుగు కాలవల్లో పూడికలు తీయకపోవడం వలన ప్రతి సంవత్సరము భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగు కాలువలు స్తంభించి పోవడం వల్ల వివిధ దశల్లో ఉన్న వరి తదితర పంటలు దెబ్బతిని నష్టపోవుచున్నామని, మురికి కాలువలలో పూడికలు తొలగించి తమకు న్యాయం చేయాలని అందులో పేర్కొన్నారు.

పెడన మండలం నందమూరు గ్రామానికి చెందిన అట్లా వీరమ్మ మాట్లాడుతూ తాను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇల్లు కట్టుకున్నానని, 2 లక్షల రూపాయలు మంజూరైందని, అందులో 62 వేల రూపాయలు మాత్రమే తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని, మిగిలిన మొత్తం జమ చేయాలని కోరుతూ అర్జీ అందజేసింది.

ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డి ఈ ఓ తహేరా సుల్తానా, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సర్వే భూ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి, ఐ సి డి ఎస్ పి డి సువర్ణ, డి.ఎస్.ఓ పార్వతి, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. పద్మావతి ఉద్యాన అధికారి జే. జ్యోతి, ఏపీఎంఐపి అధికారి విజయలక్ష్మి,ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాసులు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *