Breaking News

ఆరోగ్యవంతమైన సమాజం తోనే దేశాభివృద్ధి సాధ్యం-మంత్రి కొల్లు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందువల్ల ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం బందరు మండలం పోతేపల్లి గ్రామంలో మంత్రి జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పోస్టర్లు జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది వర్షాకాలం సీజన్ ముందు కాలువలలో కొత్తనీరు చెత్తాచెదారం కొట్టుకు వచ్చి నీటి కాలుష్యంతో డయేరియా ప్రబలుతుందని, ముందు జాగ్రత్తగా ప్రభుత్వం డయేరియా నివారణకు, తగిన అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్టాప్ డయేరియా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోందన్నారు. తాగునీటి వనరులు క్లోరినేషన్ బ్లీచింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు. కాచిన నీటిని తాగాలని, ఈ విషయాలపై కరపత్రాలు పోస్టర్లు ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు పీహెచ్సీలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య వైద్యంపై అధికంగా ఖర్చు చేస్తుందని, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం, మాతృ మరణాలు తగ్గించి, గర్భవతులకు శిశువులకు పోషకాహారం అందిస్తున్నదని ఉన్నారు. గతంలో తమ ప్రభుత్వం హయాంలో మండలంలో చిన్నాపురం తాళ్లపాలెం లలో పీహెచ్సీలు ఏర్పాటు చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు. ఏఎన్ఎంలు ఆశాలు ప్రతి ఇంటిని సందర్శించి అవగాహన కల్పిస్తారన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపట్టిన “స్టాప్ డయేరియా”క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు డయేరియా నివారణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తాగునీటి వనరులు ఓవర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీ అరికట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
పైప్లైన్ లీకేజీలు ఎక్కడైనా ఏర్పడితే పంచాయతీ సిబ్బంది దృష్టికి తేవాలని కలెక్టర్ సూచిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. అంగన్వాడీల్లో ఓఆర్ఎస్ ద్రావణం తయారీ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారన్నారు. డయోరియా పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జె గీతాబాయి, ఆర్డిఓ ఎం వాణి, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి టి. శివ ప్రసాద్, రూరల్ నాయకులు బండి రామకృష్ణ, కుంచె దుర్గా ప్రసాద్, గోపు సత్యనారాయణ, మాదివాడ రాము, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *