Breaking News

పెరటి తోటల పెంపకం.. ప్రకృతితో అనుబంధం జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పెరటి తోటల పెంపకం ద్వారా ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గురువారం ఉదయం ఆయన కలక్టరేట్ లోని సమావేశపు మందిరంలో పాఠశాల ప్రాంగణంలో పెరటి తోటల పెంపకం(కిచెన్ గార్డెన్)పై విద్య, అటవీ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషక విలువలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటల పెంపకం, వినియోగంతో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా మంచి ఆహారాన్ని పండించే విధానం, పర్యావరణంపై విజ్ఞానాన్ని పెంపొందించడం, నేలల సంరక్షణ తదితర అంశాలపై పెరటి తోటల పెంపకం ద్వారా విద్యార్థులకు అవగాహన ఏర్పర్చాలన్నారు. దీన్ని ప్రోత్సహించేందుకుగాను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 పాఠశాలల్లో పెరటి తోటల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న మచిలీపట్నం, 11న గుడివాడ, 12న ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తక్కువ స్థలంలో వివిధ రకాల పెరటి తోటల పెంపకానికి సంబంధించిన విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్ర ప్రతినిధులకు సూచించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో ప్రతి ఒక్క విద్యార్థి మొక్కను నాటి సంరక్షించే విధంగా ప్రోత్సహించాలని, అందుకు మొక్కల పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారికి సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారిణి తాహెర సుల్తాన, వ్యవసాయ శాఖ జెడి ఎన్ పద్మావతి, ఉద్యానవన శాఖ అధికారిణి జే జ్యోతి, పిడి డిఆర్డిఎ (ఇంచార్జ్) ఎస్వి నాగేశ్వర నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ రావు, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్ర ప్రతినిధి జి కృష్ణవేణి, నిమ్మకూరు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్ ఎంవీ పద్మ కుమారి, వ్యవసాయ శాఖ ఏడిఏ పార్థసారథి రావు, ఏడి మణిధర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *