Breaking News

ఆరోపణల్లో నిజం లేదు

– ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కిడ్నీ మార్పిడి చికిత్స
- ఆరుగురు సభ్యులతో కూడిన అధికారిక కమిటీ అనుమతితోనే కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించాం
– కిడ్నీ క్రయవిక్రయాలతో ఆసుపత్రికి ఏ సంబంధం లేదు
- ఆరోగ్యశ్రీ పథకంలో ద్వారా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కిడ్నీ మార్పిడి చికిత్స
- స్వార్థ ప్రయోజనాల కోసమే ఆసుపత్రిపై ఆరోపణలు
- శరత్స్ ఇనిస్టిట్యూట్ అధినేత, ప్రముఖ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ జి. శరత్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి వచ్చిన ఆరోపణలు ఏ మాత్రం నిజం కాదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తూ సదరు కిడ్నీ మార్పిడి చికిత్సను నిర్వహించామని శరత్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత, ప్రఖ్యాత కిడ్నీ మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ జి. శరత్ బాబు వెల్లడించారు. ఆసుపత్రిలో ఇటీవల నిర్వహించిన కిడ్నీ మార్పిడి చికిత్స గురించి ఇటీవల కొన్ని వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో, వాస్తవాలను తెలియజేసేందుకు సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. సూర్యారావుపేటలోని శరత్స్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జి. శరత్ బాబు మాట్లాడుతూ, కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకట స్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలన్నింటినీ పాటించి, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చికిత్స పూర్తిచేశామని తెలియజేశారు. అవయవ దానంలో ఎటువంటి ఆర్ధిక లావాదేవీలకు తావుండదని, అవయువాల క్రయ విక్రయాలకు పాల్పడినవారు చట్టప్రకారం శిక్షార్హులని వెల్లడించారు. పేషెంట్ కుటుంబ మిత్రుడైన గార్లపాటి మధుబాబు కిడ్నీ దానం చేశారని.. దాత, గ్రహీతలిరువురూ ఒకే గ్రామానికి చెందిన వారని తెలిపారు. కిడ్నీ దానం ఇచ్చేందుకు పేషెంట్ రక్త సంబంధీకులను పరీక్షించగా మ్యాచ్ కాలేదని తెలిపారు. రోగి డయాలసిస్ చేయించుకుంటూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు, మధుబాబు తన కిడ్నీ దానమిచ్చేందుకు ముందుకొచ్చాడని అన్నారు. అవయువ మార్పిడి అనుమతులిచ్చే అధికారిక కమిటీ నుంచి అనుమతి పొందిన తర్వాతే, కిడ్నీ మార్పిడి చేశామని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ, పోలీసు శాఖల వారు సమర్పించిన ధ్రువపత్రాల విశ్లేషణ అనంతరం, సమగ్రంగా విశ్లేషించి.. ఆరుగురు సభ్యులతో కూడిన అధికారిక కమిటీ కిడ్నీ మార్పిడికి అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. తమ ఆసుపత్రిలో ఇప్పటివరకు అనేక కిడ్నీ మార్పిడి చికిత్సలను నిర్వహించామని.. పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు లోబడి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నామని అన్నారు. పేషెంట్ ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా చికిత్స చేసిన తమ ఆసుపత్రిపై స్వార్థ ప్రయోజనాల కోసం బురద చల్లాలని చూడటం తమను విస్మయానికి గురి చేసిందన్నారు. సదరు కిడ్నీ మార్పిడికి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు, తాము పాటించిన ప్రోటోకాల్ వివరాలు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేసినట్లుగా ధ్రువీకరణ పత్రం.. వీటన్నింటినీ పరిశీలిస్తే, వాస్తవాలను సులభంగా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. తమ ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ శరత్ బాబు తెలియజేశారు. ఈ సమావేశంలో హాస్పిటల్ చైర్మన్ జి. వెంకట్రావు, శరత్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు డాక్టర్ ఎన్. హరిప్రసాద్, డాక్టర్ జి. ప్రశాంతి పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *