Breaking News

రాష్ట్ర ప్రగతి కోసం… మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంటులో చర్చించండి

-ఎన్డీఏ కూటమి, జనసేన పక్షాన మాట్లాడండి
-టెంపుల్ టూరిజం, ఏకో టూరిజంలపై దృష్టి సారించండి
-ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండండి
-ఎంపీలతోపాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ నిబంధన పాటించాలి
-జనసేన ఎంపీలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రగతి, మానవనరుల అభివృద్ధి, టూరిజం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ పక్షాన ఎంపికైన ఇరువురు పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపధ్యంలో ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజంలపై దృష్టి పెట్టాలని, ఇటువంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అనుకూలమో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీలకు తెలిపారు. సత్వర ఉద్యోగ అవకాశాలు పెరిగే టూరిజం, సర్వీస్ రంగాలపై దృష్టి సారిస్తూ ఇవి రాష్ట్రంలో అమలయ్యే విధంగా కేంద్రంలోని మంత్రులతో మాట్లాడాలన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలపై బాగా దృష్టి సారిస్తే మెరికల్లాంటి యువ శాస్త్రవేత్తలు బయటకి వస్తారని, కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశాలు, మార్గాలు లేక యువత పరిశోధనా రంగం వైపు రాలేకపోతున్నారని, మనం సరైన దిశగా వారికి అవకాశాలు కల్పిస్తే స్వల్ప ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయన్నారు. అదే విధంగా గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో రోడ్లు, మంచినీరు అందించడానికి కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు రాబట్టాలని వారికి సూచించారు.

సమష్టి విజయం తాలూకు భావన ప్రతి చోటా ప్రతిబింబించాలి
ఎన్నో కష్టనష్టాలకోర్చి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని సమష్టిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించామని అదే సమష్టి భావన, కృషి ప్రతి విషయంలోనూ ప్రతిబింబించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఏదైనా ఒక పథకం సాధించినప్పుడు అది వ్యక్తిగతంగా కాకుండా ఎన్డీఏ కూటమి పక్షాన, జనసేన పక్షాన సాధించుకున్నట్టు చెప్పడం మనలోని సమష్టితత్వాన్ని వెల్లడిస్తుందని వ్యక్తులకు రావలసిన పేరు ప్రతిష్టలకు సంబంధించి నేను సందర్భోచితంగా ప్రతిస్పందిస్తానని వెల్లడించారు. జనసేన నుంచి లోక్ సభలో స్థానం పొందిన ఇద్దరూ పార్టీ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని అన్నారు.
ఇద్దరు ఎంపీలతోపాటు నాతో సహా మొత్తం 21 మంది శాసనసభ్యులు ఒక రోజు అయినా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక పూట తమ నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి, మరోపూట అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారిని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఈ నిబంధనను తక్షణం ప్రతి ఒక్కరు అమలు చేయాలని కోరారు.

కూరగాయల గుచ్ఛం బహూకరణ
పవన్ కళ్యాణ్ కి ఈ సందర్భంగా ఇరువురు ఎంపీలూ కూరగాయల గుచ్ఛాన్ని అందచేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ.. తనను కలిసేందుకు వచ్చే వారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనబడేవి కాదు… పది మందికి కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. మా ఎంపీలు ఇచ్చిన కూరగాయల బొకే నన్ను ఆనందానికి గురిచేసింది. వారి స్ఫూర్తిని అంతా కొనసాగించాలి. పూల బొకేలతో డబ్బు వృథా చేయొద్దు. విగ్రహాల కోసం ఇబ్బందిపడవద్దు. శాలువాలు అసలే తేవద్దు. వాటికి వెచ్చించే మొత్తంతో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలో అన్న క్యాంటిన్లు రానున్నాయి. వాటికి ఉపయోగపడేలా టోకెన్స్ లాంటివి తీసుకొని ఇవ్వండి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు  వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ  పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *