Breaking News

పాఠశాల విద్య ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత

-మధ్యాహ్న భోజనం పథకం సక్రమంగా అమలు చేయాలి
-జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్య ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని, విద్యార్థులకు సంబంధించిన పథకాలను సక్రమంగా అమలు చేయడంలో తగిన విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన నగరంలోని తన బంగ్లా నుంచి జిల్లాలోని మండల విద్యాధికారులు (ఎంఈఓ), ఇతర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, స్టూడెంట్ కిట్స్ పంపిణీతో పాటు వాటి సమస్యలపై చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, ముఖ్యంగా గుడ్డు, చిక్కీ, రాగి జావా సక్రమంగా అందించాలని సూచించారు.

మధ్యాహ్న భోజనం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలని, పాఠశాలల్లో అందిస్తున్న పోషకాహారం తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు రక్తహీనత(అనీమియా)తో పాటు ఇతర పోషకాహార లోప సమస్యలు తలెత్తుతాయని వివరించాలన్నారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతం ప్రకారం భోజనం సిద్ధం చేయాలన్నారు. వంట చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలని, విద్యార్థులు భోజనం చేసిన తర్వాత కూడా శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణపై అధికారులు తరచుగా పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఆ సమయంలో గుర్తించిన రిమార్కులను తనకు సమర్పించాలన్నారు. ఈ క్రమంలో తాను కూడా కొన్ని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామన్నారు. పెనమలూరులోని ప్రభుత్వ పాఠశాలలో వంట చేసేందుకు షెడ్ లేదని మండల విద్యాధికారి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అక్కడ ఇంజనీరింగ్ అధికారులు పర్యటించి షెడ్ నిర్మాణం చేపట్టాలని, అందుకు అయ్యే నిధులను సమకూరుస్తామన్నారు.

విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ వివరాలపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు పంపిణీ చేసిన షూస్ సైజ్ లు సరిపోలడం లేదని, మార్చ్ ఏప్రిల్ నెలలో వారి నుంచి తీసుకున్న కొలతలకు పాఠశాలలు పున ప్రారంభం అయ్యేనాటికి వారి ఎదుగుదల కారణంగా సైజుల్లో వ్యత్యాసాలు వస్తున్నట్లు అధికారులు వివరించారు. సైజుల్లో వ్యత్యాసాలు ఉన్న షూస్ లను మిగతా పాఠశాలల్లోని సైజులను పరస్పరం మార్పిడి చేసుకోవాలని, తద్వారా చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెర సుల్తానా, విద్యాశాఖ ఏడి అజీజ్, సెక్షన్ సూపరింటెండెంట్ పవన్, ఎంఈఓ లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *