Breaking News

“ఏపీసీఎన్ఎఫ్” కు ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు

-“గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి 2024 ” కింద 3 కోట్ల నగదు బహుమతి
-దేశంలోనే ప్రప్రధమంగా APCNF కు అరుదైన అవార్డు
-గ్లోబల్ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల విస్తరణకు వినియోగించనున్న నగదు బహుమతి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోగలిగే ప్రకృతి వ్యవసాయం అమలులో గణనీయమైన పాత్ర పోషిస్తూ సుస్థిర వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలిచిన ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ఖాతాలో మరో ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు చేరింది.ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని నిరూపించిన కారణంగా ఏపీసీఎన్ఎఫ్ ప్రతిష్టాత్మక “గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి” అవార్డుకు ఎంపికైంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న దాతృత్వ సంస్థలలో ఒకటిగా నిలిచిన పోర్చుగల్ కు చెందిన “కలూస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ” 2024 వ సంవత్సరానికి ఏపీసీఎన్ఎఫ్(APCNF) ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. “గుల్బెంకియన్ ఫౌండేషన్ ” ప్రకటించిన ఉమ్మడి విజేత ల జాబితాలో APCNF (ఏపీసీఎన్ఎఫ్) చోటుచేసుకొంది. దేశంలో ప్రప్రధమంగా ఏపీసీఎన్ఎఫ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. నగదు బహుమతి కింద వచ్చే ఒక మిలియన్ యూరోల (9 కోట్ల రూపాయలు) ను ముగ్గురు విజేతలకు సమానంగా పంపిణీ చేస్తారు. సుస్థిర వ్యవసాయంతో ప్రపంచ ఆహార భద్రత, వాతావరణ సమతుల్యత, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కోసం పనిచేసే సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించే క్రమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 3 దేశాలకు చెందిన 2 సంస్థలతో పాటు ఓ ప్రముఖ శాస్త్రవేత్తను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఫౌండేషన్ ఎంపిక చేసింది. ఏపీసీఎన్ఎఫ్ (ఇండియా), సెకెమ్ (ఈజిప్ట్) సంస్థలతో పాటు ప్రముఖ నేల వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రతన్ లాల్ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ఇండియా) లను కలిపి ఉమ్మడి విజేతలుగా ప్రకటించింది. అవార్డు గ్రహీతలు తమ సుస్థిర వ్యవసాయ కార్యక్రమాలను మరింతగా విస్తరించి గ్లోబల్ స్థాయిలో భద్రతతో కూడిన సుస్థిర ఆహార వ్యవస్థలను రూపొందించడం కోసం నగదు బహుమతిని వినియోగిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులను ప్రధానంగా మహిళలను సుస్థిర ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్తూ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నందుకు ఏపీసీఎన్ఎఫ్ ను ఈ అవార్డు వరించింది. ప్రపంచ వ్యాప్తంగా 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్ లలో ఏపీసీఎన్ఎఫ్ కు ప్రైజ్ మనీ దక్కడం రాష్ట్ర ప్రభుత్వానికి, రైతు సాధికార సంస్థకు గర్వకారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక నామినేషన్ లు ఫౌండేషన్ కు వచ్చి చేరాయి. గుల్బెంకియన్ ఫౌండేషన్ ఈ అవార్డు ద్వారా సుస్థిర వ్యవసాయ మార్గాలకు గల ప్రాముఖ్యతను గుర్తించింది. విపరీత వాతావరణ మార్పులను అధిగమించగలమనే ఆశ, అవకాశాలకు ఈ అవార్డు స్పూర్తి కలిగిస్తుందని ఫౌండేషన్ గుర్తించింది. పోర్చుగల్ దేశంలోని లిస్బన్ నగరంలో 11 వ తేదీ రాత్రి 7.15 గంటలకు (భారత కాలమాన ప్రకారం రాత్రి 11.45 గంటలకు) అత్యంత వైభవంగా జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. APCNF తరపున రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ తల్లమ్ విజయ్ కుమార్, ప్రకృతి వ్యవసాయ మహిళా ఛాంపియన్ రైతు నాగేంద్రమ్మ అవార్డు అందుకొన్నారు. పోర్చుగల్ అధ్యక్షులతో పాటు ఆ దేశానికి చెందిన ప్రముఖులు, నిపుణులు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
వాతావరణంలో వస్తోన్న గణనీయమైన మార్పులు, ప్రకృతి విధ్వంసం వంటి అతిపెద్ద మానవాళి సవాళ్లను ఎదుర్కొంటున్న సంస్థలకు ప్రోత్సాహకంగా ఈ నగదు బహుమతిని ఫౌండేషన్ ప్రకటించింది. గత నాలుగేళ్లుగా 2020 నుంచి ఫౌండేషన్ ఈ అవార్డు అందిస్తోంది. ప్రజా సంస్థలు, రైతులు,ఆర్థిక వ్యవస్థలు మరియు భూమికి సుస్థిర వ్యవసాయం ఎలా దోహదపడుతుంది అనే అంశాన్ని వాస్తవికతలో ప్రదర్శించి చూపినందుకు గాను ఫౌండేషన్ ఏపీసీఎన్ఎఫ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
జర్మనీ మాజీ ఫెడరల్ చాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ అధ్యక్షతన ఏర్పాటైన స్వతంత్ర జ్యూరీ సుస్థిర వ్యవసాయంలో విజేతలు చేసిన పరిపూర్ణమైన పనితీరును గుర్తించడంతో పాటు ఆచారణాత్మకమైన అప్లికేషన్స్ మరియు శాస్త్రీయ పరిశోధన చేయాలనే సంకల్పంతో ఉమ్మడిగా అవార్డును ప్రకటించింది. ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమం ప్రపంచంలోనే ఆగ్రో ఏకాలజీ లో అతి పెద్ద కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ అవార్డు ప్రధానంగా వాతావరణ సంబంధిత సవాళ్ళు ఏ విధంగా పరస్పర అనుసంధానమై వ్యవస్తీకృత సంక్షోభాలను కలిగిస్తున్నాయనే అంశాలను ప్రధానంగా ఎత్తి చూపుతోంది. వాతావరణంలో వచ్చే మార్పు తీవ్రమవుతున్న జీవవైవిద్య నష్టాలు, భూతాపం, వనరులు నశించడం, ప్రపంచ వ్యాప్తంగా ఆహార వ్యవస్థలకు, మానవాళి ఆరోగ్యాలకు భంగం కలిగించడం వంటి చర్యలకు కారణం అవుతోందని ఫౌండేషన్ గుర్తించింది. అదే సమయంలో, సాగు భూమి విస్తీర్ణం క్షీణించడం, నీరు తగ్గిపోవడం, కర్బన ఉద్గారాలు, జీవవైవిద్య నష్టం తదితర కారణాలతో వ్యవసాయ రంగం కూడా వాతావరణ మార్పుపై గణనీయమైన ప్రభావం చూపుతోందని ఫౌండేషన్ అభిప్రాయపడింది.
ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమం రాష్ట్రంలో 10 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకువచ్చి ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ప్రకృతికి అనుగుణంగా 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేల సారూప్యంలో భారీ మార్పులు చోటుచేసుకొన్నాయి. ప్రధాన పంటతో పాటు అనేక అంతర పంటలు వేయడం వల్ల జీవ వైవిధ్యత పెరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, ముఖ్యంగా మహిళల జీవితాలలో మార్పులు తీసుకొస్తోంది. వాతావరణంలో సానుకూల మార్పులతో పాటు సామాజిక లబ్ది కూడా కలుగుతోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో పౌష్టికాహారం లభిస్తోంది. రాష్ట్రంలోని రైతులందరినీ ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న రైతు సాధికార సంస్థ ఇదివరకే 12 రాష్ట్రాలలో కూడా కార్యక్రమ అమలుకు పునాదులు వేసింది.
పోర్చుగల్ దేశంలోని లిస్బన్ నగరంలో జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు టి. విజయ్ కుమార్, ఆర్ వై ఎస్ ఎస్ ఛీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ లక్ష్మానాయక్, థిమాటిక్ లీడ్ అరుణ, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ డైరెక్టర్ స్మిత, ఏపీసీఎన్ఎఫ్ ఛాంపియన్ రైతు  నాగేంద్రమ్మ హాజరయ్యారు.

ఈ అవార్డు ప్రపంచానికి ఓ ఆశా కిరాణం – విజయ్ కుమార్
అవార్డు అందుకొన్న సంధర్భంగా విజయ్ కుమార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు 10 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతుల తరపున ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగాను, సంతోషంగాను ఉంది. గుల్బెంకియన్ ఫౌండేషన్ కు, జ్యూరీ సభ్యులులకు ఈ సంధర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు ప్రపంచ వ్యాప్తంగా క్త్లెమేట్ ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు శక్తివంతమైన సులభతర పరిష్కారం లభించిందనే ఆశ అందరిలోనూ చిగురింపజేస్తుందని, ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేస్తే వాతావరణంలో మార్పులు తప్పక తీసుకు రావచ్చునని తెలియజేశారు. రైతులు తమ ఆరోగ్యాన్ని, జీవనోపాదులను పెంపొందించుకొంటూనే భూమిని బాగుచేయవచ్చునని అన్నారు. ఇలాంటి చర్యలు మరింత విస్తరించడం మహిళా సంఘాలు చేతుల్లో ఉందని అన్నారు. రైతులు, మహిళల సమూహాలను తీర్చిదిద్దే క్రమంలో ఖర్చు చేసే శ్రమ మానవాళికి నాణ్యమైన జీవితం అందించడంలో కీలకం అన్నారు. ఈ అవార్డు కింద అందించే నగదు బహుమతిని గ్లోబల్ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.

భావితరానికి బంగారు భవిష్యత్ – నెట్టెం నాగేంద్రమ్మ
అవార్డు అందుకొన్న సంధర్భంగా నెట్టెం నాగేంద్రమ్మ మాట్లాడుతూ నేను ప్రకృతి వ్యవసాయం చేసేలా మా స్వయం సహాయక సంఘం ప్రోత్సహించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందుతూ నా ఆరోగ్యం, నా భూమిని కాపాడుకోగలిగాను. నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నన్ను చూసి 100 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో నేను చేసే పని ద్వారా పిల్లల అందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటున్నాను.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *