Breaking News

పేదరికం లేని సమాజం నా జీవిత లక్ష్యం

-సంపద సృష్టి ద్వారా సంక్షేమం అందుతుంది…ప్రజల జీవితాలు మారుతాయి
-కూటమి గెలుపుతో ప్రజల్లో అంశాంతి పోయి…ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తున్నారు
-రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఇంకా మొదలు పెట్టక ముందే ప్రజల్లో నమ్మకం మొదలైంది
-ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతోనే ప్రజలకు స్వాంతన
-హరే కృష్ణ మూవ్మెంట్, అక్షయ పాత్ర చేస్తున్న ఆధ్యాత్మిక సేవను అభినందిస్తున్నా
-అక్షయ పాత్ర ద్వారా మళ్లీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ లు ప్రారంభిస్తాం :- నారా చంద్రబాబు నాయుడు
-కొలనుకొండ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర ఆలయంలో అనంత శేష స్థాప‌న కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి/కొలనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరి అదృష్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేంది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని అన్నారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేషస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…‘‘ఏ కార్యక్రమాన్నైనా సజావుగా చేయగలుగుతామన్న నమ్మకాన్ని హరేకృష్ణ మూవ్ మెంట్ మనకు కలిగిస్తుంది. హరేకృష్ణ గోకుల్ కృష్ణ క్షేత్రాలు దేశంలో 20 ఉన్నాయి…ప్రపంచంలో 5 ఉన్నాయి. హరేకృష్ణ మూవ్ మెంట్ తో పోటీపడి ఇస్కాన్ కూడా కార్యక్రమాలు చేస్తోంది. మధుపండిత్ దాస అనుకున్నది సాధిస్తారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారు. సత్యగౌర చంద్రదాస్ కూడా ఐఐటీలో చదివారు. హరేకృష్ణ మూవ్ మెంట్ లో ఐఐటీలో చదివిన వారు 50 మంది ఉన్నారు. ఇస్కాన్ లో కూడా ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పొందిన వారున్నారు. మన దేశ సంసృతి, సాంప్రదాయాలు కాపాడటానికి జీవితాలు త్యాగాలు చేశారు. హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రతిష్టాత్మక నిర్మాణం జరుగుతోంది. 216 అడుగల ఎత్తున్న ప్రధాన గోపురంతో వెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మిస్తున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రార్థనాలయాలు లేకపోతే ఎన్నో నేరాలు, ఘోరాలు జరిగేవి
‘‘ఏ మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలైనా ఈ భూమిపై లేకపోతే జైళ్లు చాలవు. నేరాలు, ఘోరాలు ఎన్నో జరిగేవి. సైంటిస్టులు, డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, న్యాయ వ్యవస్థ…ఇలా అందరూ తమ విధులు ప్రారంభించడానికి ముందు రెండు నిమిషాల పాటు దేవున్ని ప్రార్థిస్తారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా దేవుడికి ప్రార్థనలు చేశాకే రాకెట్లు నింగిలోకి పంపుతారు. హరేకృష్ణ మూవ్ మెంట్ దేవుని సేవ మాత్రమే కాకుండా మానవ సేవ కూడా చేస్తోంది. యూపీలో వంద ఎకరాల్లో 700 అడుగుల కృష్ణుడు దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. కొలనుకొండలో 6.5 ఎకరాల్లో ఇక్కడ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. నేను సాంకేతిక పరిజ్ణానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. 25 ఏళ్లకు ముoదు ఐటీని ప్రమోట్ చేస్తే అన్ని దేశాలకు మన దేశానికి చెందిన వారు వెళ్లారు…వారిలో 30 వాతం మంది తెలుగు వారు ఉన్నారు. నేను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామినే నమ్ముతాను. మా కుటుంబ ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి. ప్రతి రోజు రెండు నిమిషాలు దేవున్ని తలుచుకుంటా. 2003లో తిరుపతిలో 23 క్లేమోర్ మైన్స్ పేలినప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వరస్వామే. మరింత శక్తి, సామర్థ్యాన్ని ఇవ్వాలని, దేశంలో తెలుగువారు నెంబర్ వన్ జాతిగా ఉండేలా దీవించాలని కోరుకుంటా. పేదరికం లేని సమాజం మనందరి బాధ్యత కావాలి.’’ అని సీఎం పిలపునిచ్చారు.

మంచి చేసే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు…సహకారం అందిస్తాం
‘‘అక్షయపాత్ర యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మధుపండిత్ దాస్ నేతృత్వంలో అక్షయపాత్రను విజయవంతంగా నడిపిస్తున్నారు. శ్రీకృష్ణుడి ఆలయం ఉన్న 10 కి.మీ పరిధిలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఆలోచనతో లాలా ప్రభుపాద స్ఫూర్తితో అక్షయపాత్రను ప్రారంభించారు. 23 ఏళ్లలో 400 కోట్లమందికి భోజనం పెట్టారు. వివిధ రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రంగా, నాణ్యతతో అందిస్తున్నారు. 22 లక్షల మందికి ప్రతి రోజూ అక్షయపాత్ర ద్వారా ఆహారం అందిస్తున్నారు. కృష్ణాపుష్కరాల సమయంలో 3 లక్షల మందికి భోజనం అందించారు. అన్నా క్యాంటీన్ కు భోజన సరఫరా కూడా గతంలో అక్షయపాత్రకే అప్పగించాను. భోజన నాణ్యతలో ఒక్క చిన్న ఫిర్యాదు లేకుండా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేశారు. 203 అన్న క్యాంటీన్లు నాడు నిర్వహించాం. కానీ గడిచిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసింది. త్వరలోనే అన్న క్యాంటీన్లు పున:ప్రారంభిస్తాం. ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదానం ప్రారంభించారు. దాతలకు దేశంలో కొదవలేదు..నమ్మకం అనే వ్యవస్థ ఉండాలి. అక్షయపాత్ర ఆధునిక వసతులతో కిచెన్ ను నడిపిస్తోంది. ప్రజల నమ్మకం, భగవంతుడు ఆశీస్సులు హరేకృష్ణ గోకులం వారికి తప్పకుండా ఉంటాయి. పెనుకొండలో లక్ష్మీనరసింహా స్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఏకశిలా రూపంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు..దానికి కూడా గత ప్రభుత్వం అడ్డుపడింది. మంచికి వచ్చే ఐదేళ్లు స్పీడ్ బ్రేకర్లు ఉండవు..మంచి చేసే వారికి సహకరిస్తాం. ప్రపచంలో ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ మన దేశంలో ఉంది. కుటుంబ వ్యవస్థ మనకు అన్ని విధాలా అండగా, రక్షణగా ఉంటుంది. తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. హరేకృష్ణ గోకులం, ఇస్కాన్ కు మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి, సహకరిస్తుంది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *