Breaking News

ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం

-10 రోజులపాటు కొనసాగనున్న నాలుగో విడత సభ్యత్వ నమోదు
-ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ
-సమష్టిగా పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పని చేద్దాం
-సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా క్రతువు మరోసారి ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం 10 రోజులపాటు నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మూడు నెలల క్రితమే పార్టీ క్రియాశీలక సభ్యుల సభ్యత్వ గడువు అయిపోయినప్పటికీ ఎన్నికల సమయం కావడంతో పార్టీ శ్రేణులను గందరగోళపర్చకూడదని భావించి మూడు నెలలపాటు వర్తించే రెన్యూవల్ రుసుమును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో చెల్లించారు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్లీ ప్రారంభించనున్నారు. 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శనివారం సాయంత్రం జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, శ్రేణులతో ప్రత్యేకంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నమోదు ప్రక్రియ విధివిధానాలను వివరించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మనలో ఉంటూ.. మన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు మనమంతా ఉన్నామనే భరోసాను క్రియాశీలక సభ్యత్వం ఇస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ విజయం సాధించడానికి అంతా సమష్టిగా కష్టపడ్డాం. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లగలిగాం. వేయి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు 6.47 లక్షల మంది క్రియాశీల సభ్యులతో కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న క్రియాశీలక సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజక వర్గ నేతలు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలి. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే సభ్యులను మరింత పెంచాల్సిన అవసరం ఉంది.

ప్రతి గ్రామం… ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు ఉండాలి
గతంలో ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది పార్టీ వాలంటీర్లకు మాత్రమే సభ్యత్వ నమోదుకు సంబంధించిన లాగిన్ ఐడీ ఇచ్చేవాళ్లం. అయితే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడీ ఇవ్వాలని నిర్ణయించాం. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలి. పార్టీ సభ్యత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ జరగాలి. పార్టీ సిద్ధాంతాలతో పాటు సగటు మనుషులను పార్టీకి దగ్గర చేయడానికి ఈ సభ్యత్వ నమోదు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి అనుకోని ఆపద వస్తే, వారి కుటుంబానికి బీమా సొమ్ములు స్వయంగా అందించి పార్టీ కార్యకర్తలకు మనమంతా అండగా నిలబడిన తీరు స్ఫూర్తిదాయకం. పార్టీ సభ్యత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. వారందరినీ పార్టీ గొడుగులోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం, ప్రతి వార్డును సభ్యత్వ వాలంటీర్లు తిరిగి 10 రోజులపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొవాలి. తెలంగాణలో సైతం మన పార్టీ అభిమానులు, కార్యకర్తలున్నారు. వారు కూడా సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. క్షేత్రస్థాయి నాయకులు కూడా ఎప్పటికప్పుడు వాలంటీర్లను సమన్వయం చేసుకుంటూ.. చిన్నచిన్న సమస్యలు లేకుండా చూసుకోవాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా పనిచేయాలి.’’ అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్, పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, పార్టీ ఐటీ విభాగ ఛైర్మన్ మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *