Breaking News

అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం .. జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు విన్నవించిన సమస్యలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, బందరు ఆర్డిఓ ఎం వాణిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిర్ణీత సమయానికి పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యంతో అర్జీలను పెండింగ్లో ఉంచరాదని అధికారులకు సూచించారు.

మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు:

ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ మద్దేటిపల్లి గ్రామంలోని ప్రభుత్వ లేఔట్ లో కొంతమంది అక్రమంగా స్థలం పొందాలని, అక్కడ పక్కా గృహ నిర్మాణం చేపట్టకుండానే అక్రమంగా బిల్లులు పొందారని, నిధులను మంజూరు చేసిన హౌసింగ్, రెవెన్యూ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని బంటుమిల్లి మండలం పల్లికొండ వారి మోడీ గ్రామానికి చెందిన పల్లికొండ వెంకటేశ్వరరావు అర్జీ ద్వారా ఫిర్యాదు చేశారు.

తనకు గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో సర్వే నంబర్ 307/3లో 0.10 సెంట్లు భూమి ఉందని, తన స్వాధీన అనుభవ హక్కులో ఉండి, అడంగల్, ఆర్ఓఆర్ లు ఉన్న సదరు భూమి మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిగా నమోదు కాబడి ఉందని, నిబంధనను తొలగించి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొనుటకు అవకాశం కల్పించాలని ఆ గ్రామ కాపురస్తుడు అల్లు నరేష్ విజ్ఞప్తి చేస్తూ అర్జీ సమర్పించారు.

నాగాయలంక మండలం వర్రచివర గ్రామంలోని ఆక్వా సాగు విద్యుత్ సర్వీసుతో పాటు మీటర్ ను కూడా తొలగించారని, కనీస సమాచారం అందించకుండా తొలగించిన సదరు సర్వీసును పునరుద్ధరించాలని బాపట్ల జిల్లాకు చెందిన మార్పు ధీనమ్మ కోరారు.

తన తండ్రి అన్నే వెంకట శివయ్యకు స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో కోడూరు మండలం ఉల్లెపాలెం, హంసలదీవి ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని మంజూరు చేసిందని, అందుకు సంబంధించిన పట్టా నకళ్ళను ఇప్పించవలసిందిగా అన్నే సుబ్రహ్మణ్యేశ్వరి అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిసిఈఓ ఆనంద్ కుమార్, డ్వామా పిడి జీవీ సూర్యనారాయణ, డిపిఓ/డిఆర్డిఎ పిడి నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిఐసి జిఎం వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారిణి జే. జ్యోతి, జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెర సుల్తాన, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, డీఎస్ఓ పార్వతి, ఐసిడిఎస్ పిడి సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎన్ పద్మావతి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *