Breaking News

ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసిన ప్రభుత్వం… : మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో డయేరియా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క నెలలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి అని తెలియజేశారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలు ముందుగా గుర్తించకపోవడం, డయేరియా ప్రభావిత ప్రాంతాలలో తగు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని నిప్పులు చెరిగారు. ముఖ్యంగా జగ్గయ్యపేట, తిరుపతి, విజయవాడ మొగల్రాజపురం, గుంటూరు, పిడుగురాళ్ల, ఉరవకొండ వంటి ప్రాంతాలలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి కర్నూలు జిల్లా సుంకేశ్వరీ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. తిరుపతిలో ఇద్దరు, పిడుగురాళ్లలో ఏడుగురు, జగ్గయ్యపేటలో ఆరుగురు అతిసారం కాటుకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జనం పిట్టల్లా రాలిపోతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మంత్రులు సైతం చోద్యం చూస్తూ.. నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చాక మరోలా నాయకులు వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైన ప్రభుత్వం స్పందించి బాధిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అన్ని రకాల సీజనల్ మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి.. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు. లేకుంటే ఇప్పటివరకు సంభవించిన మరణాలన్నింటినీ ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 139 మంది అస్వస్థతకు గురికావడం బాధాకరమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *