Breaking News

ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించడంతోపాటు సీట్ బెల్ట్ వేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రమాదాల నివారణకు వాహనదారులు ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం (హెల్మెట్) ధరించడంతోపాటు సీట్ బెల్ట్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఉద్యోగులకు శిరస్త్రాణం ధరించడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఎంతో అవసరం ఉందని, అయితే చాలామంది ద్విచక్రవాహంలో వచ్చే కలెక్టరేట్ ఉద్యోగులు శిరస్త్రాణం (హెల్మెట్ ) ధరించకుండా వస్తున్నారన్నారు. ఏదైనా ఒక రోజు ప్రమాదం జరిగితే ఎవరు వచ్చి మనల్ని గాని, మన కుటుంబాన్ని గాని ఆదుకుంటారని ఒకసారి ఆలోచించాలి అన్నారు. ప్రాణాలను పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా అని ప్రశ్నించారు.

కలెక్టరేట్లో రహదారి భద్రత సమావేశాలు నిర్వహించి వాహనందారులు ప్రతి ఒక్కరు శిరస్త్రాణం ధరించాలని, ప్రభుత్వం తరఫున అందరికీ చెప్పడం జరుగుతుందన్నారు. అయితే కలెక్టరేట్ సిబ్బందే శిరస్త్రాణం ధరించకుండానే విధులకు రావడం సరైనది కాదని స్పష్టం చేశారు. రహదారి భద్రత సమావేశంలో ప్రమాద వివరాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం గత ఆరు నెలలుగా 398 ప్రమాదాలు సంభవించాయని, అందులో 177 మంది ప్రాణాలు కోల్పోయారని, ఎందుకని కారణం లోతుగా అధ్యయనం చేస్తే 60 నుంచి 70 శాతం మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వేసుకోకుపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోయారని వెలుగులోకి వచ్చాయన్నారు. జిల్లాలో ఇకపై రహదారి ప్రమాదాలు తగ్గించడంతో పాటు ప్రాణ నష్టం తగ్గించడానికి సీటు బెల్టు పెట్టు మరణం ఆటకట్టు అనే నినాదంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా చేపట్టడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ముందుగా ఇంటి వద్ద నుండే మొదలు కావాలనే ఇంటిని చక్కదిద్దాలనే ఉద్దేశంతో తొలిసారిగా కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. చాలామందికి హెల్మెట్ లేదని గుర్తించి వారికి అపరాధ రుసుము చెల్లించాలని కోరడం లేదని, భయభ్రాంతులకు గురి చేయడం లేదని కేవలం ఒక హెల్మెట్ దుకాణాన్ని ఏర్పాటు చేసి హెల్మెట్ లేని వారికి ఆ హెల్మెట్ కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. హెల్మెట్ ఉంది అన్నవారికి వారి పేరు వివరాలను నమోదు చేసుకుని సాయంత్రంలోగా హెల్మెట్ చూపించిన వారికి వారి బండి తాళాలు అందజేయాలన్నారు. రేపటి (శుక్రవారం) నుండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి కలెక్టరేట్కు కావాలని సూచించారు. వాహనదారుల మంచి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దీన్ని ప్రతికూలంగా భావించవద్దన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి కలెక్టరేట్ కు వచ్చిన డిఆర్ఓ సిసి వెంకటేశ్వరరావును జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయనకు ఆయన పైన భయం ఉందని, ఆయన కుటుంబం పైన ప్రేమ ఉందన్నారు. అందుకే ఆయన హెల్మెట్ ధరించి కార్యాలయానికి వచ్చారన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోరాదని నిరంతరం జరిగేలా చూడాలని కలెక్టర్ డి టి సి కి సూచించారు. తదుపరి కొంతమంది కలెక్టరేట్ ఉద్యోగులు హెల్మెట్ కొనుగోలు చేయగా వారికి జిల్లా కలెక్టర్ దగ్గరుండి హెల్మెట్లను అందజేశారు. రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసి ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో రాబోయే రోజుల్లో ప్రమాదాల నివారణకు, ప్రమాదాల తగ్గింపుకు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిటిసి పురేందర్, ఎంవిఐలు సోనీ ప్రియా, సిద్ధిఖ్, సంగీతరావు ఏఎంవిఐలు లోకనాథ్, సత్యనారాయణ కలెక్టరేట్ ఏవో నాంచారయ్య తదితరు అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *